Womens T20 World Cup 2024:బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి విదేశాలకు వెళ్లిపోయారు. ఎక్కడ చూసినా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది జరిగే మహిళల టీ20 ప్రపంచకప్‌నకు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కాగా, బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో ఆ దేశంలో మహిళల వరల్డ్ కప్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ వేదికను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వేదికలో మార్పు?
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌కప్ బంగ్లాలో నిర్వహించడం సాధ్యసాధ్యాలపై ఐసీసీ మరో ప్లాన్‌తో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తటస్థ దేశాలైన భారత్, శ్రీలంక, యూఏఈ వంటి ఏదో ఒక దేశంలో నిర్వహించే అవకాశం ఉంది. 'ఐసీసీ దాని సభ్య దేశాలన్నింటిలో స్వతంత్ర భద్రతా పర్యవేక్షణ వ్యవస్థను కలిగి ఉంది. బంగ్లాదేశ్‌లో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ ప్రారంభానికి ఇంకా ఏడు వారాల సమయం ఉంది. ఈ మెగా టోర్నీని బంగ్లాదేశ్ నుంచి మారుస్తారా లేదా అని ఇప్పుడే వ్యాఖ్యానించడం చాలా తొందరపాటు అవుతుంది' అని ఐసీసీ బోర్డు మెంబర్ ఒకరు వ్యాఖ్యానించారు.
అక్టోబరు 3 నుంచి 20వ తేదీ వరకు మహిళల టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది. ఈ మెగా టోర్నీ మ్యాచ్‌లు ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం, సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. అయితే బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో ఆ దేశానికి ఎవరూ వెళ్లవద్దని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు బంగ్లాదేశ్‌లో టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు వెళ్తుందా అనే ప్రశ్న ఎదురువుతోంది.