ICC Test Rankings :ఐసీసీ తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో టీమ్ఇండియా ప్లేయర్లు రాణించారు. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో అత్యద్భుత పెర్ఫామెన్స్‌తో ఈ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. మ్యాచ్ ముందు వరకు టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఒకటి నుంచి మూడో స్థానంలో పడిపోయాడు. ఇప్పుడు ఆసీస్‌పై అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి, మళ్లీ ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం బుమ్రా 883 పాయింట్లతో తొలి స్థానాన్ని కైవసం చేసుకోగా, కగిసో రబాడ (872), జోష్ హేజిల్‌వుడ్ (860) తర్వాతి స్థానాలను సొంతం చేసుకున్నారు. ఇక రవిచంద్రన్ అశ్విన్ (807) ఒక స్థానం మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి దూసుకొచ్చాడు. రవీంద్ర జడేజా ఏడో స్థానంలో నిలిచాడు.
9 స్థానాలు ఎగబాకిన రన్నింగ్ మెషిన్
ఇదిలా ఉండగా,ఆస్ట్రేలియాపై వరుస సెంచరీలు బాదిన యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ తమ ర్యాంకులను క్రమంగా మెరుగుపర్చుకున్నారు. 825 పాయింట్లతో జైస్వాల్ రెండు ర్యాంకులు పైకి వచ్చి రెండో స్థానాన్ని సాధించగా, 903 పాయింట్లతో ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక రిషభ్ పంత్ (736) ఆరో స్థానానికి పరిమితమవ్వగా, రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ 689 పాయింట్లతో ఏకంగా 9 స్థానాలకు ఎగబాకాడు. ప్రస్తుతం 13వ ర్యాంకులో ఉన్నాడు. ఇక గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన శుభ్‌మన్ గిల్ 17వ స్థానంలో ఉన్నాడు.