తెలంగాణ

telangana

ICC టీమ్ ఆఫ్ ది టోర్నీ- రోహిత్ సహా 6గురు టీమ్ఇండియా ప్లేయర్లే - T20 World cup 2024

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 7:00 AM IST

T20 World Team of Tournament: 2024 టీ20 వరల్డ్​కప్​ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్​ను ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టులో అత్యధికంగా టీమ్ఇండియా నుంచి ఆరుగురు ప్లేయర్లు ఎంపికయ్యారు.

T20 World Team of The Tourney
T20 World Team of The Tourney (Source: Associated Press)

T20 World Team of Tournament:2024 టీ20 వరల్డ్​కప్​ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్​ను ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఈ టీమ్​లో ఏకంగా ఆరుగురు టీమ్ఇండియా ప్లేయర్లకు చోటు లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్​కు టోర్నీ ఆఫ్ ది టీమ్​లో స్థానం దక్కింది. టీమ్ఇండియా తర్వాత అఫ్గానిస్థాన్ నుంచి అత్యధికంగా ముగ్గురు ప్లేయర్లు ఎంపికయ్యారు.

  • రోహిత్ శర్మ (భారత్): టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టోర్నీలో అదరగొట్టాడు. అటు కెప్టెన్​, ఇటు బ్యాటర్​గా రెండు బాధ్యతలను సమర్థంగా నిర్వహించాడు. ఈ టోర్నీలో ఆడిన 8 మ్యాచ్​ల్లో 157.70 స్ట్రైక్ రేట్​తో 257 పరుగులు చేశాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా సూపర్- 8లో ఆస్ట్రేలియాపై ఆడిన (92 పరుగులు 41 బంతుల్లో) ఇన్నింగ్స్​ టోర్నీలోనే హైలైట్​గా నిలిచింది.
  • రహ్మానుల్లా గుర్బాజ్ (అఫ్గానిస్థాన్): ఈ టోర్నీలో గుర్బాజ్ అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్​గా నిలిచాడు. అఫ్గాన్​కు శుభారంభాలు అందిస్తూ మంచి స్కోర్లు నమోదు చేశాడు. 8 మ్యాచ్​ల్లో 281 పరుగులు చేసి టాప్​లో నిలిచాడు.
  • నికొలస్ పూరన్ (వెస్టిండీస్) : నికొలస్ పూరన్ విండీస్​ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తమ జట్టు సెమీస్​కు చేరకపోయినా, గ్రూప్ దశలో పూరన్ ఆకట్టుకున్నాడు. టోర్నీలో 228 పరుగులతో రాణించాడు. అఫ్గానిస్థాన్​పై 98 పరుగులు ఇన్నింగ్సే ఈ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్​గా ఉంది.
  • సూర్యకుమార్ యాదవ్ (భారత్):మిస్టర్ 360 ప్లేయర్ సూర్య టీమ్ఇండియాకు మిడిలార్డర్​లో కీలకంగా మారాడు. ఈ టోర్నీలో 199 పరుగులతో రాణించాడు. ముఖ్యంగా సెమీస్​లో ఇంగ్లాండ్​పై 47 పరుగుల ఇన్నింగ్స్​ జట్టుకు ఎంతో ఉపయోగపడింది.
  • మార్కస్ స్టోయినిస్ (ఆస్ట్రేలియా):ఆల్​రౌండర్ స్టోయినిస్ బ్యాట్, బంతితో ఆకట్టుకున్నాడు. ఏకంగా 164 స్టైక్ రేట్​తో 169 పరుగులు చేశాడు. ఇటు బౌలింగ్​లోనూ స్టోయినిస్ తన మార్క్ చూపించాడు. బంతితో రాణిస్తూ 10 వికెట్లు పడగొట్టాడు.
  • హార్దిక్ పాండ్య (భారత్): టీమ్ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య ఫైనల్​ మ్యాచ్​లో ఏకంగా హీరో అయ్యాడు. ఈ టోర్నీలో అల్​రౌండర్​గా తన పాత్ర చక్కగా పోషించాడు. 144 పరుగులు బాదాడు. బౌలింగ్​లోనూ రాణిస్తూ 11 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో పొట్టికప్​ టోర్నీలో 100+ పరగులు, 10+ వికెట్లు తీసిన ఏకైక భారత్ ప్లేయర్​గా నిలిచాడు.
  • అక్షర్ పటేల్ (భారత్): టీమ్ఇండియా మరో ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ కీలకమైన మ్యాచ్​ల్లో జట్టును ఆదుకున్నాడు. సెమీస్​లో ఇంగ్లాండ్​పై 3 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టిన అక్షర్, ఫైనల్​లో జట్టు ఆపదలో ఉన్నప్పుడు బ్యాటింగ్​కు దిగాడు. ఈ మ్యాచ్​లో 47 పరుగులు బాది జట్టు మంచి స్కోర్ సాధించడంలో కీలకమయ్యాడు. మొత్తంగా 92 పరుగులు, 9 వికెట్లు పడగొట్టాడు.
  • రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్): రషీద్ సారథ్యంలో బరిలోకి దిగిన అఫ్గాన్ ఈ టోర్నీలో సంచలనాలు సృష్టించింది. కెప్టెన్సీలో ఆకట్టుకున్న రషీద్​ బౌలర్​గానూ తన కర్తవ్యం నిర్వర్తించాడు. టోర్నీలో 14 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
  • జస్ప్రీత్ బుమ్రా (భారత్): టీమ్ఇండియా ఛాంపియన్​గా నిలవడంలో కీలక పాత్ర బుమ్రాదే. జట్టుకు అవసరమైనప్పుడల్లా నేనున్నానంటూ బ్రేక్ ఇచ్చాడు. ఈ టోర్నీలో 4.17 ఎకనమీతో బౌలింగ్ చేసి 15 వికెట్లు నేలకూల్చాడు. దీంతో బుమ్రాకు మ్యాన్​ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కింది.
  • అర్షదీప్ సింగ్ (భారత్):భారత్ మరో పేస్ గన్ ఆర్షదీప్ సింగ్. టీమ్ఇండియా తరఫున ఈ టోర్నీలో అర్షదీప్ అత్యధిక వికెట్లు పడగొట్టాడు. 7.16 ఏకనమీతో 17 వికెట్లు పడొగొట్టి సత్తా చాటాడు.
  • ఫజల్లా ఫరూకీ (అఫ్గానిస్థాన్):అఫ్గానిస్థాన్ బౌలర్ ఫజల్లా ఫరూకీ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్​గా అర్షదీప్​కో సమానంగా నిలిచాడు. ఫరూకీ ఈ టోర్నీలో 17 వికెట్లు పడగొట్టి అఫ్గాన్ విజయాల్లో కీలకంగా మారాడు.

ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీ:రోహిత్ శర్మ, రహ్మానుల్లా గుర్బాజ్, నికొలస్ పూరన్, సూర్యకుమార్ యాదవ్, మార్కస్ స్టొయినిస్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, ఫజల్లా ఫరూకీ, అన్రీచ్ నోకియా (12th ప్లేయర్).

ABOUT THE AUTHOR

...view details