ICC Champions Trophy 2025 : పాకిస్థాన్ వేదికగా సుమారు 29 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియ్స్ ట్రోఫీ జరగనుంది. 1996 వన్డే ప్రపంచ కప్‌నకు చివరిసారిగా పాక్ హోస్ట్‌గా వ్యవహరించింది. ఇప్పుడు మళ్లీ ఈ సారి ఆతిథ్యం ఇస్తోంది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ ట్రోఫీ నిర్వహణకు ఎటువంటి ఆటంకాలు ఉండకూడదనే ఉద్దేశంతో పెద్దఎత్తున భద్రతా ఏర్పాట్లను చేస్తోంది. సెక్యూరిటీకి సంబంధించి తమపై ఉన్న అపవాదును తొలగించేందుకు పీసీబీ నడుం బిగించినట్లు అక్కడి మీడియా తాజాగా వెల్లడించింది.
12వేల మంది పోలీసుల పహారా!
మరోవైపు లాహోర్, రావల్పిండి మైదానాల్లో జరగనున్న మ్యాచ్‌ల కోసం సుమారు 12వేల మందికి పైగా పోలీసులను మోహరించినట్లు సమాచారం. ఇందులో 18 మంది సీనియర్ ఆఫీసర్లు, 54 మంది డీఎస్పీలు, 135 మంది ఇన్‌స్పెక్టర్లు, అలాగే 1200 మంది సబార్డినేట్‌లు, 10,556 మంది కానిస్టేబుళ్లు ఉన్నారట.
వారితో పాటు 200 మంది వరకు మహిళా పోలీసులను కూడా కేటాయించారు. లాహోర్‌లో గ్రూప్ స్టేజ్‌లో ఫిబ్రవరి 22, 26, 28న మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 5న రెండో సెమీస్‌కు లాహోర్ వేదిక. ఇక్కడే దాదాపు 8వేలకు పైగా సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించినట్లు పలు వార్తలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా, రావల్పిండిలో మరో నాలుగు వేల మందికి పైగా పోలీసులను మోహరించనుంది పీసీబీ. తొలి మ్యాచ్‌కు వేదికైన కరాచీలోనూ పెద్దఎత్తున సెక్యూరిటీని పీసీబీ పెట్టింది. ఇక్కడా గ్రూప్ స్టేజ్‌లో మూడు మ్యాచ్‌లు జరుగుతాయి.