Harshit Rana 3 Wicket Haul :ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టింది టీమ్ఇండియా. మొదటి నుంచి బంగ్లా బ్యాటర్లను కట్టడి చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు మహ్మద్ షమీ, హర్షిత్ రాణా. అలా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటును ఈ ఇద్దరూ తీర్చారు.
ఇక ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించిన హర్షిత్ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాడు. అలా ప్రశంసలు అందుకుని నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు. అయితే ఇక్కడే అతడి గణాంకాలపై ఓ లుక్కేయాలి. తనకు '3' నెంబర్‌తో ఓ ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. అదేంటంటే?
- గత ఐపీఎల్‌లో అదరగొట్టి టీమ్ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ పేసర్ ఈ పేసర్ ఇటీవల అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అరంగేట్ర మ్యాచ్‌ల్లోనే అతడికి 'మూడు'తో బంధం మొదలైంది. ఆడిన ప్రతి తొలి మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు తీయడం విశేషం.
- పెర్త్ వేదికగా 2024 నవంబర్‌లో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు హర్షిత్ రాణా. అయితే ఆడిన తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనే అతడు మూడు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు.
- గత నెల(జనవరి)లో ఇంగ్లాండ్‌పై టీ20ల్లో ఎంట్రీ ఇచ్చాడు. పుణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 33 పరుగులనిచ్చి మూడు వికెట్లు తీశాడు.
- నాగ్‌పుర్ వేదికగా ఫిబ్రవరి 6న ఇంగ్లాండ్‌తో జరిగిన తన తొలి వన్డే మ్యాచ్‌లో 53 పరుగులు సమర్పించుకుని మూడు వికెట్లు తీశాడు.
- ఇదిలా ఉండగా, ఐసీసీ ట్రోఫీలో మొదటి సారి ఆడుతున్న హర్షిత్, మరోసారి తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు పడగొట్టాడు. బంగ్లాపై తాజాగా జరిగిన తొలి మ్యాచ్‌లో 31 పరుగులు ఇచ్చి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
అలా ఈ లక్కీ '3'తో తనకున్న సంబంధం గురించి క్రీడాభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. పలువురు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఆదివారం పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లోనూ తను ఇదే తీరులో చెలరేగాలని కోరుకుంటున్నారు.