Mohammed Siraj Champions Trophy : టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా అతడ్ని మేనేజ్‌మెంట్ తుది జట్టులోకి తీసుకులేదు. అయితే తన స్థానంలో యంగ్ పేసర్ హర్షిత్ రాణా స్క్వాడ్‌లోకి చేరాడు. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు బదులు మరో స్టార్ క్రికెటర్ వరుణ్ చక్రవర్తిని మేనేజ్‌మెంట్ తీసుకుంది. ఈ విషయం సిరాజ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
సిరాజ్‌ను మెయిన్ స్క్వాడ్‌లోకి తీసుకోకుండా నాన్ ట్రావెల్ రిజర్వ్‌గా ఎంపిక చేసింది మేనేజ్‌మెంట్. ఇలా ఒక సీనియర్ పేసర్‌ను పక్కనపెట్టడం సరైన పద్ధతి కాదంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుమ్రా తర్వాత 2022 నుంచి అత్యధిక వికెట్లను తన ఖాతాలో వేసుకున్న సిరాజ్‌ను ఎందుకు తీసుకోలేదని, 2023 జనవరిలో వన్డే టాప్ బౌలర్‌గా నిలిచాడంటూ గుర్తు చేశారు.
"బుమ్రా తుది స్క్వాడ్‌లో లేడు. షమీ ఇంకా ఫామ్ అందుకోలేదు. యంగ్‌గా ఉన్న హర్షిత్ రాణాను ఇప్పుడు పరీక్షించడం అంత అవసరమా? సిరాజ్‌కు ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు? మ్యాచ్ విన్నరైన సిరాజ్‌కు జట్టులో స్థానం కూడా లేకుండా చేయడమనే విషయం చాలా దారుణం"
"టీమ్ఇండియా హెడ్ కోచ్ ఏకపక్షంగా, స్వార్థంతో నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా ఉంది. తను కేవలం కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేయర్లను మాత్రమే జట్టులోకి ఎంపిక చేస్తాడేమో. అందుకే సిరాజ్‌ను కాదని హర్షిత్‌ను తీసుకోవడం, యశస్వి ప్లేస్‌లో వరుణ్‌ను ఎంపిక చేయడం చూస్తుంటే అదే నిజమని అనిపిస్తోంది. టీమ్ఇండియా క్రికెట్లో ఇటువంటివి జరగడం ఎంతో బాధాకరం"