India Vs Pakistan Champions Trophy 2025 :ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు పేలవ ఫామ్‌తో సెమీస్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. ఆతిథ్య జట్టే ఇలా సెమీస్ కూడా చేరుకోకుండాపోవడం బాధాకరమంటూ పాక్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు సొంత ప్లేయర్స్‌పై మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పాక్ ఆటతీరుపై మాజీ మహిళా కెప్టెన్ సనా మీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటగాళ్లు ఎంపిక సరిగా లేదంటూ సెటైర్లు వేశారు.
"ప్రస్తుతం 15 మంది ప్లేయర్లున్న పాకిస్థాన్ టీమ్‌కు ఎంఎస్ ధోనీ లేకుంటే యూనిస్ ఖాన్ లాంటి స్టార్లను కెప్టెన్‌గా అపాయింట్ చేసినా ఆ జట్టుతో వారు ఏమీ చేయలేరు. నేను మ్యాచ్ చూస్తుండగానే నా ఫ్రెండ్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. టీమ్ఇండియా స్కోర్ 100/2. ఇక మ్యాచ్ చేజారినట్టే అని అందులో రాసుంది. అయితే తుది స్క్వాడ్ అనౌన్స్ చేసినప్పుడే ఈ మ్యాచ్ మన చేజారిపోయిందని నాకు తెలసుని చెప్పా. నియమాలకు అనుకూలంగా ఈ జట్టు ఎంపిక జరగలేదు. 15 మందితో కూడిన టీమ్‌ను ప్రకటించినప్పుడే టోర్నీలో సగం మ్యాచ్‌లు ఓడినట్టే అని అనుకున్నాను. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగిన రెండు సిరీస్‌లలో ఆడిన కీలక ప్లేయర్లను సెలక్షన్ కమిటీ తొలగించింది" అని సనా మీర్ అన్నారు.
16ఏళ్ల తర్వాత తొలిసారి
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించడం గత 16 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు 2009 ఎడిషన్‌కు ఆతిథ్యమిచ్చిన సౌతాఫ్రికాకు ఇదే పరిస్థితి ఎదురైంది. 2009 ఛాంపియన్స్ ట్రోఫీలో సఫారీ జట్టు మూడు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో నెగ్గి, మిగిలిన రెండింటిలో ఓడారు. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు.