England TeamIndia Test Series Kohli : టీమ్ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జనవరి 25న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్లకు స్టార్ బ్యాటర్ కోహ్లీ దూరం కానున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో ఉండట్లేదని బీసీసీఐ ప్రకటించింది. అతడి స్థానంలో ఎవరిని ఆడించాలో త్వరలోనే మెన్స్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది.
తాను అందుబాటులో ఉండకపోవడంపై విరాట్ కోహ్లీ కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టు మేనేజ్‌మెంట్, సెలక్టర్లతో మాట్లాడాడట. దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు ప్రథమ ప్రాధాన్యత అయినప్పటికీ కొన్ని వ్యక్తిగత కార్యక్రమాల్లో తాను ఉండటం తప్పనిసరి అవ్వడం వల్ల ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని వివరించాడని తెలిసింది. అతడి నిర్ణయానికి గౌరవం ఇచ్చి మద్దతుగా నిలుస్తామని బీసీసీఐ తెలిపింది. మిగతా జట్టు సభ్యులపై కూడా తమకు నమ్మకం ఉందని, వారు ఈ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తారని చెప్పింది.
ఇంకా విరాట్ కోహ్లీ ప్రైవసీకి భంగం కలిగించొద్దని బీసీసీఐ మీడియాను, అభిమానులను కోరింది. ఫ్యాన్స్ అందరి ఫోకస్ టీమ్ ఇండియాకు మద్దతు ఇవ్వడంపైనే ఉండాలని విజ్ఞప్తి చేసింది. అభిమానులు మద్దతు చేస్తేనే భారత ఆటగాళ్లు సవాళ్లను అధిగమిస్తారని పేర్కొంది.