Virat Kohli Kevin Pietersen:2024 ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జర్నీ ముగిసింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో బుధవారం రాజస్థాన్‌తో ఓడిన ఆర్సీబీ ఇంటిబాట పట్టింది. దీంతో ఐపీఎల్ టైటిల్ ముద్దాడాలన్న విరాట్ కల నెరవేరలేదు. ఈ సీజన్లో బ్యాట్‌తో అద్భుతంగా రాణించి 741 పరుగులు బాదినా, తన జట్టు ఎలిమినేటర్‌లోనే నిష్క్రమించింది. దీంతో 17 సీజన్లుగా ట్రోఫీ కోసం ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ విరాట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. విరాట్ ఐపీఎల్ కప్పు కొట్టాలంటే జట్టు మారాలని అభిప్రాయపడ్డాడు.
'నేను ఇదివరకు చెప్పాను, మళ్లీ చెబుతున్నా- ఇతర క్రీడల్లో పెద్ద పెద్ద స్టార్లంతా జట్టు నుంచి మారిన తర్వాత పేరు సంపాదించారు. ఈ సీజన్లో విరాట్ ఎంతో కష్టపడ్డాడు. పరుగుల వరద పారించి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. కానీ, టీమ్ ఫెయిలైంది. అర్సీబీ జట్టుకు విరాట్ కావాల్సినంత బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తున్నాడు. కానీ, టైటిల్ అందుకోవడానికి విరాట్ అర్హుడు. అందుకే టైటిల్ సాధించే సామర్థ్యం ఉన్న జట్టులోకి తను వెళ్లిపోవాలి' అని అన్నాడు. ఈ క్రమంలో ఫుట్‌బాల్ దిగ్గజాలు డేవిజ్ బెక్కమ్, క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సి, హ్యారీ కేన్‌ను గుర్తుచేశాడు. వాళ్లంతా కెరీర్లో సుదీర్ఘ కాలం ఒక క్లబ్లో ఉన్నప్పటికీ ఫ్రాంచైజీలు మారారని అన్నాడు.
ఇక విరాట్ దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు వెళ్తే బాగుంటుందని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. 'విరాట్ దిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్తే బాగుంటుందని నా ఆలోచన. పైగా విరాట్ స్వస్థలం కూడా దిల్లియే. అక్కడ అతడికి ఇల్లు కూడా ఉంది. దీంతో హోం గ్రౌండ్లో మ్యాచ్‌లకు తన కుటుంబ సభ్యులతో గడిపే సమయం లభిస్తుంది. ఇక దిల్లీ కూడా టైటిల్ కోసం 17ఏళ్లుగా ఎదురుచూస్తుంది' పీటర్సన్ అన్నాడు.