Paris Olympics Controversy:స్టీవెన్ వాన్ డి వెల్డే నెదర్లాండ్స్‌కు చెందిన బీచ్ వాలీబాల్ ప్లేయర్. ఇప్పుడు పారిస్ వేదికగా జరుగతున్న ఒలింపిక్స్‌లో ఇతడి పేరు సంచలనంగా మారింది. నెదర్లాండ్స్ బీచ్ వాలీబాల్ ప్లేయర్‌గా స్టీవెన్ వాన్ డి వెల్డే పారిస్ ఒలింపిక్స్ బరిలో దిగుతున్నాడు. ఒలింపిక్ పతకం గెలవాలన్న తన చిరకాల కోరికను తీర్చుకునేందుకు ఈ బీచ్ వాలీబాల్ ప్లేయర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అయితే ఇక్కడే విమర్శలు చెలరేగుతున్నాయి. స్టీవెన్ వాన్ డి వెల్డేను ఒలింపిక్స్‌కు ఎంపిక చేయడంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు వెల్డేను ఎలా ఎంపిక చేశారని, దానిపై విచారణ చేయాలని కూడా ఆదేశించింది.
అసలు ఏమైందంటే?12 ఏళ్ల చిన్నారిపై, స్టీవెన్ వాన్ డి వెల్డే దశాబ్దం కిందట అత్యాచారం చేశాడన్న అభియోగం ఉంది. 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినందుకు వెల్డే జైలు శిక్ష కూడా అనుభవించాడు. మైనర్‌పై అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో 19ఏళ్ల వయసులో వెల్డేను అరెస్ట్ చేశారు. 2014లో లండన్‌కు చెందిన 12 ఏళ్ల బాలికతో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకున్న వెల్డే, ఆ తర్వాత ఆమె ఉంటున్న దగ్గరికి వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో 2016లో వెల్డేకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడింది. అనంతరం నేరగాళ్ల బదిలీ ఒప్పందం ప్రకారం బ్రిటన్ ప్రభుత్వం వెల్డేను నెదర్లాండ్స్‌కు అప్పగించింది. వెల్డేకు శిక్ష విధించేటప్పుడు న్యాయమూర్తి షెరిడాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ శిక్షతో ఒలింపిక్‌లో పాల్గొనాలనే మీ కల కలగానే మిగిలిపోనుందని వ్యాఖ్యానించారు. కాగా, 12 నెలలపాటు జైలు శిక్ష అనుభవించిన వెల్డే 2017లో విడుదల అయ్యాడు.