Types Of Cricket Balls:టెస్టు మ్యాచ్ సిరీస్‌లో దాదాపు సొంత గడ్డపై ఆడుతున్న జట్లు మెరుగైన ప్రదర్శన చేస్తాయి. అయితే అప్పుడప్పుడు ఓటములు తప్పవు. కానీ స్వదేశంలో టీమ్ ఇండియా అజేయంగా దూసుకుపోతోంది. 2012 నుంచి భారత్ సొంత గడ్డపై ఒక టెస్టు సిరీస్ కూడా కోల్పోలేదు. చాలా మంది ఈ విజయానికి స్పిన్ అనుకూలమైన పిచ్‌లు కారణమని చెబుతుంటారు. ఎవ్వరూ క్రికెట్ బాల్ గురించి మాట్లాడరు. వాస్తవానికి భారత్‌లో ఉపయోగించే SG బాల్‌తో ఇతర దేశాలు కాస్త ఇబ్బంది పడతాయి. ఎస్జీ బాల్ స్వదేశంలో భారత్‌కు అదనపు ప్రయోజనం అందిస్తుంది. ఇంతకీ టెస్టు క్రికెట్‌లో ఎన్ని రకాల బాల్‌లు ఉపయోగిస్తారు? ఎలా తయారు చేస్తారు? వీటి ప్రభావం ఎంత? తెలుసుకుందాం.
టెస్టు మ్యాచ్‌లో బంతి ప్రాముఖ్యత
క్రికెట్‌లో పిచ్ పరిస్థితులు, వాతావరణం వంటి అనేక అంశాలు మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. అలానే ఉపయోగించే బాల్ కూడా ప్రభావం చూపుతుంది. ప్రతీ జట్టు వివిధ మ్యానుఫ్యాక్చరర్‌లు తయారు చేసే బాంతిని ఉపయోగిస్తాయి. ఇవి స్థానిక పరిస్థితులు, ఆడే శైలికి అనుగుణంగా ఉంటాయి. ప్రతి జట్టు ఒకే రకమైన బంతిని ఉపయోగించానే నిబంధనలు ఏమీ లేవు. కానీ, టెస్టు క్రికెట్‌లో ఆతిథ్య దేశాన్ని బట్టి మూడు రకాల బంతులు SG, డ్యూక్స్, కూకబుర్ర ఎక్కువగా ఉపయోగిస్తారు.
క్రికెట్ చట్టాల ప్రకారం, కొత్త క్రికెట్ బంతి 155.9 గ్రాముల నుంచి 163 గ్రాముల మధ్య ఉండాలి. చుట్టుకొలత 22.4 సెం.మీ, 22.9 సెం.మీ మధ్య ఉండాలి. ఈ నిబంధనలు క్రికెట్ బంతుల పరిమాణం, బరువులో స్థిరత్వాన్ని తీసుకొస్తాయి.
SG బాల్ (భారత్) :SG బంతిని భారత్‌లో, ముఖ్యంగా టెస్టు మ్యాచ్‌లలో ఉపయోగిస్తారు. ఈ బంతి ఎక్కువ సీమ్ కలిగి ఉంటుంది. దాదాపు 40- 50 ఓవర్ల వరకు చెక్కు చెదరదు. భారత్‌లో పొడి, ధూళి పరిస్థితుల్లో బంతి త్వరగా దాని షైన్ కోల్పోతుంది. అయితే 40వ ఓవర్ తర్వాత బౌలర్లు రివర్స్ స్వింగ్ రాబట్టడానికి అనుకూలంగా ఉంటుంది. రివర్స్ స్వింగ్ అనేది బౌలర్లకు కీలకమైన ఆయుధం. ఈ బంతిని వినియోగించడం ఇతర జట్లకు కాస్త కష్టమవుతుంది.
SG బాల్ చరిత్ర 1931 నాటిది. మొదటిసారిగా సియాల్‌కోట్‌లోని కేదార్‌నాథ్ , ద్వారకానాథ్ సోదరులు తయారు చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, బంతి తయారీ మేరఠ్‌కు మారింది. 1991లో SG బంతి భారత టెస్టు మ్యాచ్‌లలో ఉపయోగించడానికి అధికారికంగా ఆమోదం లభించింది.
డ్యూక్స్ బాల్ (ఇంగ్లాండ్) :డ్యూక్స్ బంతి (The Dukes Ball)ని క్రికెట్‌లో 1760 నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది ముదురు రంగులో ఉంటుంది. ఇతర బంతుల కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. డ్యూక్స్ బాల్ ఎక్కువ స్వింగ్‌ను అందిస్తుంది. ముఖ్యంగా చల్లని, తడిగా ఉన్న ఇంగ్లాండ్ వంటి దేశాలకు అనువుగా ఉంటుంది. ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్లు జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ఈ బంతితో మెరుగైన ఫలితాలు రాబట్టారు. టెస్టు క్రికెట్‌లో వీరిద్దరే ఈ బంతితో 1,300 వికెట్లు తీశారు. ఇంగ్లాండ్, వెస్టిండీస్ మాత్రమే డ్యూక్స్ బంతిని అన్ని ఫార్మాట్లలో ఉపయోగిస్తాయి.
కూకబుర్ర బాల్ (ఆస్ట్రేలియా) :ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూకబుర్ర (Kookaburra Ball) బంతిని 1946/47 యాషెస్ సిరీస్‌లో తొలిసారి ప్రవేశపెట్టింది. డ్యూక్స్, SG వలె కాకుండా కూకబుర్ర బంతిని యంత్రంతో తయారు చేస్తారు. ఇది తక్కువ సీమ్‌ను ఇస్తుంది. డ్యూక్స్ బంతిలాగా స్వింగ్ అవ్వదు. ఇది ఎక్కువ సమయం హార్డ్‌గా ఉంటుంది. మొదటి 30 ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక వంటి దేశాలు కూకబుర్ర బంతిని ఉపయోగిస్తాయి. 1890లో ప్రారంభమైన కూకబుర్ర కంపెనీ మెల్‌బోర్న్‌లో ఉంది. అధిక- నాణ్యత గల క్రికెట్ పరికరాలను ఉత్పత్తి చేయడంలో ఈ కంపెనీ ప్రసిద్ధి చెందింది.