David Warner Retirement Champions Trophy 2025 : వార్నర్ రీసెంట్గా ముగిసిన టీ20 వరల్డ్‌కప్ 2024తో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అనంతరం మళ్లీ మనసు మార్చుకుని సెలక్టర్లు ఎంపిక చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు అందుబాటులో ఉంటానని తెలిపాడు. అయితే తాజాగా వార్నర్ అనౌన్స్‌మెంట్‌పై ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ స్పందించాడు. తమ భవిష్యత్ ప్రణాళికలో వార్నర్ లేడని, తమకు తెలిసిన సమాచారం ప్రకారం అతడు రిటైర్ అయ్యాడని అన్నాడు. తమ ప్రణాళికల్లో కొత్త ఆటగాళ్లు ఉన్నారని పేర్కొన్నాడు. బెయిలీ మాటలను పరిశీలిస్తే వార్నర్ తిరిగి జట్టులోకి రావాలనుకున్నా వచ్చే అవకాశం లేదని అర్థమవుతోంది.
"డేవిడ్ వార్నర్ రిటైర్ అయ్యాడు. మూడు ఫార్మాట్లలో అతడి కెరీర్ అద్భుతంగా సాగింది. అందుకు అతడిని అభినందించాలి. పాకిస్థాన్ పర్యటన విషయానికొస్తే అతడు మా ప్రణాళికలో లేడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు వేర్వేరు ఆటగాళ్లతో ముందుకెళ్తోంది" అని పేర్కొన్నాడు.
Warner Career : కాగా, 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో టీమ్ఇండియాపై ఆస్ట్రేలియా గెలుపొందింది. ఈ మ్యాచ్ తర్వాత వార్నర్ వన్డేలకు బై చెప్పాడు. అనంతరం ఈ ఏడాది జనవరిలో పాకిస్థాన్‌తో టెస్టు మ్యాచ్ ఆడి దానికి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌తో టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో కలిపి 18, 995 పరుగులు చేశాడు వార్నర్.