Cricketers Debuted With Dhoni But Faded Away :టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోవడం అంత సులువు కాదు. డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి, తమలోని ప్రతిభను చాటుకుంటే తప్ప భారత జాతీయ జట్టు తలుపులు తెరుచుకోవు. అయితే టీమ్ ఇండియాకి ఎంపికైన అందరి కెరీర్‌లు ఒకేలా ఉండవు. కొందరు భారీ అంచనాలతో మొదలైనా, మధ్యలోనే కెరీర్ ముగిసిపోతుంది. ఇంకొందరు సుదీర్ఘకాలం కొనసాగుతారు. ఇందుకు చాలా కారణాలు ఉండవచ్చు.
భారత లెజెండరీ క్రికెటర్లలో ధోని ఒకడు. సక్సెస్‌ఫుల్ భారత కెప్టెన్‌గా, బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు పొందాడు. సుదీర్ఘకాలం జట్టులో కొనసాగాడు. అయితే 2004లో ధోని అరంగేట్రంతో కొందరు ఆటగాళ్లు, ముఖ్యంగా పార్థివ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ ప్రమాదంలో పడింది. అద్భుతంగా క్రికెట్ జర్నీ మొదలుపెట్టిన వారి కెరీర్ అనూహ్యమైన మలుపు తిరిగింది.
పార్థివ్ పటేల్ vs ఎంఎస్ ధోని
17 ఏళ్ల వయస్సులోనే పార్థివ్ పటేల్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్‌గా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 2002లో ఇంగ్లాండ్‌పై మొదటి టెస్ట్ ఆడాడు. ధోని కాలంలో, పార్థివ్ ప్రధానంగా వన్డేలు, టీ20 క్రికెట్ ప్రారంభ సంవత్సరాల్లో జట్టులో ఉన్నాడు.
మొదట్లో పార్థివ్ భారీ అంచనాలతోనే అడుగుపెట్టాడు. అయితే ఆ తర్వాతి కాలంలో పార్థివ్ కెరీర్ చాలా ఎత్తుపల్లాలు ఎదుర్కొంది. జట్టుకు చాలా కాలం దూరంగా ఉన్నాడు. 2018లో ధోని టెస్టుల నుంచి రిటైర్ అయిన తర్వాత అతను తిరిగి టెస్టు జట్టులోకి వచ్చాడు. ఈ పునరాగమనం అతని దృఢ సంకల్పాన్ని నిదర్శనం. కానీ అప్పటికే చాలా సంవత్సరాలు కోల్పోయాడు.