Cricket Umpires Qualification And Salary Details : మన దేశంలో క్రికెట్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు క్రికెట్ ఆడటానికి, చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. వీరిలో ఎక్కువ మంది క్రికెటర్ కావాలని కలలు కంటుంటారు. క్రికెట్‌లో కెరీర్ కోరుకునే వారికి ప్లేయర్‌గా మాత్రమే కాకుండా ఇతర ఆప్షన్లు చాలానే ఉన్నాయి.
మీకు ప్లేయర్‌గా అవకాశాలు రాకపోతే క్రికెట్‌లో అంపైర్‌గా స్థిరపడవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో అంపైర్ల ఇన్‌కమ్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంతకీ అంపైర్ కావాలంటే ఏం చేయాలి? అని ఆలోచిస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
అంపైర్లు ఏం చేస్తారు?
క్రికెట్‌లో అంపైర్ల పాత్ర చాలా కీలకం. మ్యాచ్ సక్రమంగా జరిగేలా, ఆటగాళ్లందరూ రూల్స్ పాటించేలా చూస్తారు. మ్యాచ్ సమయంలో అంపైర్లు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి డెసిషన్ అంతిమంగా ఉంటుంది. క్రికెట్‌లో రెండు రకాల అంపైర్లు ఉంటారు. ఆన్-ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ సమయంలో మైదానంలో నిల్చుని నిర్ణయాలు తీసుకుంటారు. థర్డ్ అంపైర్ కఠినంగా ఉండే నిర్ణయాలు తీసుకోవడానికి వీడియో టెక్నాలజీని ఉపయోగిస్తాడు. టీమ్‌లు ఆన్ ఫీల్డ్ అంపైర్‌ల నిర్ణయాన్ని సవాలు చేస్తూ, రివ్యూ కోరినప్పుడు థర్డ్ అంపైర్ కీలకం. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సాయంతో బాల్‌ని ట్రాక్ చేసి, వీడియోలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాడు.
అంపైర్ అవ్వాలంటే ఏ స్కిల్స్ అవసరం?
అంపైర్ కావడానికి, క్రికెట్ ఆడిన అనుభవం అవసరం లేదు. మీరు ఆటను బాగా అర్థం చేసుకోవాలి. క్విక్ డెసిషన్ మేకింగ్, మంచి కమ్యూనికేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్ (అంపైర్లు ఎక్కువ గంటలు నిలబడతారు కాబట్టి) అవసరం. మ్యాచ్ సమయంలో అన్ని అంశాలు జాగ్రత్తగా పరిశీలించేందుకు కంటి చూపు బావుండాలి.