Rishab Pant IPL 2025 :2025 ఐపీఎల్ రిటెన్షన్స్‌కు సమయం దగ్గరపడుతోంది. ఫ్రాంచైజీలు ఎవరెవరిని అట్టిపెట్టుకుంటున్నాయి? ఎవరిని వేలంలోకి వదిలేస్తున్నాయి? అనే జాబితాను మరో 24 గంటల్లో బోర్డుకు సమర్పించాల్సి ఉంది. గురువారం (అక్టోబర్ 31) సాయంత్రం 5.00 గంటలలోపు అన్ని జట్లు రిటెన్షన్ లిస్ట్ రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఏ ఫ్రాంచైజీ కూడా అట్టిపెట్టుకోనున్న ఆటగాళ్ల జాబితాను అధికారికంగా ప్రకటించలేదు.
ఈ క్రమంలోనే దిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ రిషభ్ పంత్‌ను జట్టులో నుంచి రిలీజ్ చేయనుందని ప్రచారం సాగుతోంది. ఈ సారి పంత్ మెగా వేలంలోకి రావడం పక్కా అని క్రీడా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇదే విషయంపై క్రికెట్ ఎక్స్పర్ట్ ఆకాశ్ చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఒకవేళ పంత్ వేలంలోకి వస్తే, అతడి కోసం ఫ్రాంచైజీలు పోడీ పడతాయని అభిప్రాయపడ్డాడు. మెగా వేలంలో ఈ యంగ్ ప్లేయర్ భారీ ధర దక్కించుకుంటాడని అన్నాడు.
'పంత్ మెగా వేలానికి అందుబాటులో ఉంటాడని సమాచారం. అయితే టీ20ల్లో పంత్ గణాంకాలు అంత చెప్పుకోదగినవిగా లేవని. ఐపీఎల్‌లోనూ పెద్దగా రాణించిన సందర్భాలు లేవని చాలా మంది అంటున్నారు. కానీ, పంత్ వేలంలోకి వస్తే మాత్రం భారీ ధరకు అమ్ముడవుతాడని రాతపూర్వకంగా హామీ ఇవ్వగలను. దిల్లీ అతడిని మళ్లీ కోరుకుంటే ఆర్‌టీఎం కార్డు అందుబాటులో ఉంటుంది. కానీ, ఇక్కడ బెంగళూరు జట్టుకు వికెట్ కీపర్, కెప్టెన్, బ్యాటర్ కావాలి. ఇషాన్ కిషన్‌ను ముంబయి రిలీజ్ చేస్తే వాళ్లకు పంత్ అవసరం ఉంది. నికోలస్ పూరన్‌ను లఖ్‌నవూ రిటైన్ చేసుకున్నా, పంత్ కోసం ఆసక్తి చూపుతుందని భావిస్తున్నా. ఇక చెన్నై, కోల్‌కతా, పంజాబ్ జట్లకూ పంత్ కావాలి. అటు గుజరాత్, రాజస్థాన్ జట్లు కూడా పంత్‌పై కన్నేసే ఛాన్స్ ఉంది. అందుకే వేలంలో పంత్ భారీ ధరకు అమ్ముడవుతాడు. రూ. 25- 30 కోట్లు దక్కించుకుంటాడని అనుకుంటున్నా' అని ఆకాశ్ పేర్కొన్నాడు.