Champions Trophy PCB Chairman Mohsin Naqvi : ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై పాకిస్థాన్ తగ్గట్లేదు. ఎలాగైనా తమ దేశంలో ఐసీసీ టోర్నీని నిర్వహించి తీరాలని పట్టుపడుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడంపై పీసీబీ స్పష్టమైన వైఖరితో ఉందని వ్యాఖ్యానించారు. ఈ టోర్నీ కోసం భారత్ తమ దేశం రాకపోతే, భవిష్యత్తులో పాకిస్థాన్ కూడా భారత్‌కు వెళ్లదని మరోసారి అన్నారు.
'భారత్ అలా చేయడం కరెక్ట్ కాదు' -"పాకిస్థాన్‌లో ఐసీసీ టోర్నమెంట్ ఆడేందుకు భారత్ రాకపోవడం ఆమోదయోగ్యం కాదు. 2023 వన్డే ప్రపంచ్ కప్‌లో ఆడడానికి పాక్ భారత్‌కు వెళ్లింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై పీసీబీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. పాకిస్థాన్ క్రికెట్‌కు ఏది అవసరమో అదే చేస్తున్నా. నిరంతరం ఐసీసీ ఛైర్మన్‌తో టచ్‌లో ఉంటున్నా. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం కోసం మాట్లాడుతున్నాను. ఐసీసీ టోర్నీ కోసం పాక్‌కు భారత్ రాకపోతే, తర్వాత మా జట్టు కూడా భారత్ వెళ్లదు. ఈ విషయాన్ని ఐసీసీకి ఇప్పటికే స్పష్టంగా చెప్పాం." అని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
'పాక్ ప్రభుత్వానికి తెలియజేస్తాం' -ఐసీసీ సమావేశంలో తీసుకునే ఏ నిర్ణయమైనా తుది ఆమోదం కోసం పీసీబీ పాకిస్థాన్ ప్రభుత్వానికి తెలియజేస్తుందని నఖ్వీ తెలిపారు. "మేము ఏమి చేసినా అది పాకిస్థాన్ క్రికెట్ ప్రయోజనాలు కోసమే అని గతంలో చెప్పాను. అదే విషయాన్ని మళ్లీ పునరావృతం చేస్తున్నాను. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జైషా డిసెంబరు 1న ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. అప్పుడు ఆయన ఐసీసీ ప్రయోజనాల కోసం పనిచేస్తారని అనుకుంటున్నాను. ఎవరైనా అలాంటి పదవిని స్వీకరించినప్పుడు సంస్థ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నిస్తారు." అని నఖ్వీ అన్నారు.