Brian Lara Test Records:వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియన్ లారా తన టెస్టు ఫార్మాట్ రికార్డులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. లారా 2004లో టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 400 పరుగులు బాది వరల్డ్ రికార్డు సృష్టించాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆ రికార్డు లారా పేరిటే ఉంది. అయితే తన రికార్డులు త్వరలో బ్రేక్ అయ్యే ఛాన్స్ లేకపోలేదని లారా అన్నాడు. ఈతరం యంగ్ ప్లేయర్ల అగ్రెసివ్ క్రికెట్‌తో తన రికార్డులు బద్దలవడం సాధ్యమేనని తాజాగా పాల్గొన్న ఓ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు. అయితే టీమ్ఇండియా యంగ్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్‌కు తన టెస్టు రికార్డులు బ్రేక్ చేసే సత్తా ఉందని లారా అభిప్రాయపడ్డాడు.
'వివ్ రిచర్డ్స్, గార్డన్ గ్రీన్డేలాండి అగ్రెసివ్ బ్యాటర్లున్న 1970, 80ల్లో సర్ గార్ఫిల్డ్ సోబర్స్ 365 రికార్డు బ్రేక్ అవ్వలేదు. కానీ, మా తరం నాటికి టెస్టుల్లో వీరెంద్ర సేహ్వాగ్, క్రిస్ గేల్, ఇంజామమ్ ఉల్ హక్, సనత్ జయసూర్య ఈజీగా 300 పరుగులు బాదేశారు. అలాగే ఈ తరం కుర్రాళ్లు కూడా అనేక రికార్డులు బ్రేక్ చేస్తారన్న నమ్మకం నాకు ఉంది. ఏదైనా అగ్రెసివ్ క్రికెట్‌తోనే ఇది సాధ్యమవుతుంది. టీమ్ఇండియాలో గిల్, జైశ్వాల్ ఇంగ్లాండ్‌లో జాక్ క్రాలీ, హ్యారీ బ్రూక్ ప్రస్తుతం అలా అగ్రెసివ్ క్రికెట్ ఆడే ప్లేయర్లే. వారికి పరిస్థితి అనుకూలిస్తే, భవిష్యత్‌లో కచ్చితంగా ఈ రికార్డులను బద్దలుకొడతారు' అని లారా అన్నాడు.