BCCI Warns Ishan Kishan:టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ప్రవర్తన పట్ల బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ జట్టుకు దూరమైన ఇషాన్ కనీసం రంజీల్లో కూడా ఆడకుండా, ఏకంగా ఐపీఎల్ కోసం సన్నద్దమవడం బోర్డు మేనేజ్మెంట్కు నచ్చలేదని సమాచారం. ఇషాన్తోపాటు దేశవాళీలో రెడ్‌బాల్ క్రికెట్ (టెస్టు) ఆడేందుకు నిరాకరిస్తున్న ప్లేయర్లకు నోటీసులు ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్ అయ్యిందట.
టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించని ప్లేయర్లంతా వారి వారి సొంత రాష్ట్రాలకు రంజీల్లో ప్రాతినిధ్యం వహించాల్సిందేనని బీసీసీఐ పేర్కొంది. పూర్తి ఫిట్‌గా లేని, గాయాల నుంచి ఎన్సీఏ (NCA)లో కోలుకుంటున్న వారికి మాత్రమే ఇందులో మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. జనవరి నుంచే కొందరు ఆటగాళ్లు ఐపీఎల్ కోసం ప్రిపేర్ అవ్వడం వల్ల బీసీసీఐ ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.
అయితే టీమ్ఇండియాకు దూరమైన ఇషాన్ కిషన్, ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ పట్ల ఆసక్తి చూపట్లేదు. అతడు ఇటీవల మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. బరోడా రిలయన్స్ స్టేడియంలో హార్దిక్ పాండ్యతో కలిసి నెట్స్‌లో శ్రమిస్తున్నాడు. దీంతో అతడు రంజీల్లో ఆడకుండా డైరెక్ట్‌గా ఐపీఎల్లో బరిలో దిగడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న రంజీలో ఝార్ఖండ్‌కు ఒకే మ్యాచ్ మిగిలి ఉంది. ఫిబ్రవరి 16నుంచి రాజస్థాన్‌తో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఇషాన్ ఇప్పటికీ తన పేరు జట్టుతో నమోదు చేసుకోలేదు.