Ind vs Ban U19 Asia Cup 2024: అండర్ 19 ఆసియా కప్ 2024 ఫైనల్లో యువ భారత్‌కు షాక్ తగిలింది. టైటిల్ పోరులో బంగ్లాతో తలపడ్డ టీమ్ఇండియా 59 పరుగుల తేడాతో ఓడింది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 36 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్ అమన్ (26 పరుగులు), హార్దిక్ రాజ్ (24 పరుగులు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. భారీ అంచనాలు పెట్టుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (9 పరుగులు) తీవ్రంగా నిరాశ పర్చాడు. గతేడాది విజేతగా నిలిచిన బంగ్లాదేశ్ ఈసారి కూడా టైటిల్ నిలబెట్టుకుంది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. రిజాన్ హసన్ (47 పరుగులు; 65 బంతుల్లో 3 x4 ), షిహాబ్ (40 పరుగులు; 67 బంతుల్లో 3x4, 1X6), ఫరిద్ హసన్ (39 పరుగులు; 49 బంతుల్లో 3x4) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో యుధాజిత్ గుహా, చేతన్ శర్మ , హార్దిక్ రాజ్ తలో 2, కిరణ్, కేపీ కార్తికేయ, ఆయుష్ మాత్రే తలో 1 వికెట్ పడగొట్టారు. కాగా, గతేడాది కూడా భారత్‌ను బంగ్లాదేశ్ సెమీ ఫైనల్లో ఓడించింది.