Team India Future Superstars:భారత క్రికెట్ జట్టులో ప్రతి జనరేషన్‌కు ఆయా ఆటగాళ్లు సూపర్ స్టార్లుగా కొనసాగారు. గతంలో సచిన్ తెందూల్కర్, సౌరభ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ తదితరులు టీమ్ఇండియాకు ప్రతిష్ఠాత్మక విజయాలు అందించారు. ఇక గత దశాబ్ద కాలంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. జట్టుకు అవసరమైన సందర్భాల్లో బ్యాట్‌తో అదరగొట్టి విజయాలు అందిస్తున్నారు.
అయితే ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరూ, రానున్న రెండేళ్లలో మిగిలిన ఫార్మాట్లకూ గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా ఫ్యూచర్ స్టార్లు ఎవరు అనే ప్రశ్న పదేపదే ఉత్పన్నమవుతోంది. అయితే ఇదే ప్రశ్న రీసెంట్గా ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఎదురైంది. కానీ, వాళ్లు ఎక్కువగా ఆలోచించకుండా యంగ్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్ పేర్లను ఎంచుకున్నారు.
అందులో స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్, కేమరూన్ గ్రీన్ శుభ్‌మన్ గిల్‌వైపు మొగ్గు చూపగా, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, నాథన్ లియోన్ యశస్వి జైశ్వాల్‌కు ఓటు వేశారు. 2019లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గిల్ తన ఖాతాలో ఇప్పటికే వన్డే డబుల్ సెంచరీ వేసుకోగా, గతేడాది టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన జైశ్వాల్ 9 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 2 ద్విశతకాలు సాధించాడు.