Archery World Cup 2024 :ఆర్చరీ ప్రపంచకప్ 2024లో భారత ఆర్చర్లు తమ సత్తా చాటారు. తాజాగా జరిగిన ఫైనల్స్‌లో పోటాపోటీగా ఆడి భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు అందించారు. శనివారం జరిగిన కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో వరల్డ్‌కప్ స్టేజ్- 1 ఫైనల్‌లో భారత మహిళల టీమ్ జ్యోతి సురేఖ, అదితి స్వామి, ప్రర్ణీత్ కౌర్‌లతో కూడిన జట్టు ప్రత్యర్థి ఇటలీ టీమ్‌పై 236-225 తేడాతో నెగ్గి గోల్డ్ మెడల్ పట్టేశారు.
ముఖ్యంగా తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఈ ఫైనల్‌లో తనదైన శైలిలో ఆడి సత్తా చాటింది. మిక్స్‌డ్ డబుల్ ఈవెంట్ మహిళా జట్టు స్వర్ణాలు గెలవడంలో జ్యోతి సురేఖ కీలక పాత్ర పోషించింది.
ఇక కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్‌లో 158-157 తేడాతో ఎస్తోనియా జట్టుపై గెలుపు సాధించింది. పురుషుల టీమ్ ఈవెంట్‌లో అభిషేక్ వర్మ, ప్రియాన్ష్, ప్రథమేశ్‌తో కూడిన ఇండియన్ టీమ్ నెదర్లాండ్‌కు చెందిన మైక్ స్కాలోసెర్, సిల్ పటెర్, స్టెఫ్ విలిమ్స్ టీమ్‌పై 238-231 తేడాతో అలవోకగా చిత్తు చేశారు. దీంతో స్వర్ణం ఆ జట్టు సొంతమైంది.