Aman Sehrawat Weight Loss:పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ 57కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్లో యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ శుక్రవారం కాంస్య పతకం నెగ్గాడు. అయితే కాంస్యం ముద్దాడిన అమన్ సెహ్రావత్ పోటీకి ముందు ఉండాల్సిన (57 కేజీలు) దానికంటే అధిక బరువున్నాడు. రీసెంట్గా వినేశ్ ఫొగాట్ ఇదే కారణంతో డిస్క్వాలిఫై అవ్వడం వల్ల అమన్‌పై కూడా అనర్హత వేటు పడుతుందేమోనని అభిమానుల్లో ఆందోళన కలిగింది. కానీ, అమన్ సెహ్రావత్ విషయంలో మేనేజ్‌మెంట్ జాగ్రత్తలు తీసుకుంది.
గురువారం జరిగిన సెమీస్‌లో ఓడిన తర్వాత అమన్ బరువు 61.5 కేజీలు ఉందట. దీంతో అమన్ బరువుపై శ్రద్ధ తీసుకున్నాడు. కాంస్య పోరు (శుక్రవారం రాత్రి) నాటికి 57 కేజీలకు తగ్గడానికి కఠినంగా శ్రమించాడు. కేవలం 10 గంటల వ్యవధిలోనే ఏకంగా 4.6కేజీలు తగ్గాడు. దానికోసం సీనియర్ కోచ్‌లు జగమందర్ సింగ్, వీరేందర్ దహియాతోపాటు మరో ఆరుగురి బృందం కష్టపడింది.
కాంస్య పోరుకు ముందు శుక్రవారం ఉదయం అమన్ బరువును తూచారు. సరిగ్గా 10 గంటల సమయం మాత్రమే ఉంది. భారత బృందం అమన్‌ను గంటపాటు వేడినీళ్ల స్నానం, ఆగకుండా గంటసేపు ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేయించి జిమ్‌కు తీసుకెళ్లారు. అక్కడ కఠినమైన కసరత్తులు చేయించారు. మళ్లీ 30 నిమిషాల బ్రేక్ ఇచ్చారు. దాదాపు ఐదు సెషన్లపాటు ఐదేసి నిమిషాల చొప్పున సానా బాత్ చేయించారు. చివరి సెషన్ సమయానికి 900 గ్రాములు అధిక బరువు ఉన్నట్లు కోచ్‌లు గుర్తించారు.
దీంతో నెమ్మదిగా జాగింగ్ చేయమని అమన్‌కు సూచించారు. ఇలా 15 నిమిషాలు చేయించారు. అప్పుడు సమయం శుక్రవారం ఉదయం 4.30 గంటలు. అప్పటికి అమన్ బరువు 56.9 కేజీలకు చేరాడు. అంటే తాను పోటీ పడిన వెయింట్ (57కేజీలు) కంటే 100గ్రాములు తక్కువే ఉన్నాడు. దీంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది. ఈ సమయంలో నిద్ర కూడా పోలేదని అమన్ తెలిపాడు. రెజ్లింగ్‌కు సంబంధించిన వీడియోలు చూస్తూ ఉండిపోయినట్లు చెప్పాడు.