Alyssa Healy South Africa Test : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ సతీమణి అలీసా హీలి కూడా మంచి ప్లేయరన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆసీస్ మహిళల టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది ఈమె. అయితే ఇటీవలే తాను ఆడిన మ్యాచ్‌లో జరిగిన ఘటన అచ్చం తన భర్త కెరీర్‌లో ఎదుర్కొన్నట్లుగానే జరిగింది. యాదృచ్చికంగా జరిగిన ఈ ఇన్సిడెంట్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే ?
అప్పుడు మిచెల్- ఇప్పుడు హీలీ
2013లో భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ 99 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టాడు. ఇది స్టార్క్ కెరీర్‌లో తొమ్మిదవ మ్యాచ్. అయితే యాదృచ్చికంగా స్టార్క్ భార్య అలీసా కూడా ఇటీవలే తన తొమ్మిదవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల వద్ద ఔటైంది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరుగతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తృటిలో సెంచరీ మిస్ చేసుకుంది హీలి. ఇలా తొమ్మిదో టెస్ట్‌లో ఈ జంట 99 పరుగుల వద్ద ఔట్ కావడం ఇప్పుడు నెట్టింట ఆసక్తికరంగా మారింది. ఇది చూసిన అభిమానులు భర్త అడుగుజాడల్లో భార్య నడవడం అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు.