Krunal Pandya Emotional Post:టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య టీ20 వరల్డ్‌కప్ విజయంలో కీలక పాత్ర పోషించడం పట్ల అతడి సోదరుడు కృనాల్ పాండ్య ఎమోషనలయ్యాడు. 2024 ఐపీఎల్ సందర్భంగా హార్దిక్‌పై ఎదురైన వ్యతిరేకత పట్ల అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. హార్దిక్ కూడా మనిషే అని అతడికి కూడా ఎమోషన్స్ ఉంటాయని అందరూ మర్చిపోయారని కృనాల్ అన్నాడు.
'నేను, హార్దిక్ 10ఏళ్లుగా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాం. గత కొన్ని రోజుల్లో జరిగింది చూస్తే మా కలలు నెరవేరినట్లయింది. నా సోదరుడు సాధించిందిన దాన్ని చూసి నేను చాలా ఎమోషనల్ అయ్యాను. గత 6 నెలలు అతడికి చాలా కష్టంగా గడిచాయి. జనాలు అతడిని ఎగతాళి చేయడంమే కాకుండా తిట్టారు కూడా. అతడు కూడా అందరిలాగే భావోద్వేగాలు కలిగిన మనిషే అనే విషయాన్ని అందరు మరిచిపోయారు. హార్దిక్ ఎప్పుడూ జాతీయ జట్టుకే ప్రాధాన్యం ఇస్తాడు. బరోడా నుంచి వచ్చిన ప్లేయర్‌కు టీమ్ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించడం కంటే పెద్ద విషయం మరొకటి లేదు. ఇప్పుడు సాధించిన దానికి హార్దిక్ పూర్తిగా అర్హుడు' అని వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ కంటతడిపెట్టుకున్న వీడియో ఒకటి షేర్ చేశాడు.
ఇక వరల్డ్‌కప్ విన్నింగ్ ప్లేయర్ హార్దిక్‌కు ఇంటివద్ద ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు అతడికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. చాలా రోజులుగా దూరంగా ఉన్న కుమారుడు అగస్త్యను ప్రేమతో దగ్గరకు తీసుకొని మురిసిపోయాడు. తాను సాధించిన ఛాంపినన్ మెడల్ కుమారుడి మెడలో వేశాడు. కొడుకుతో సరదాగా గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'నా ప్రపంచం నువ్వే, నీ కోసం ఏదైనా చేస్తా' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు.