NZ vs AFG Test 2024:న్యూజిలాండ్ - అఫ్గానిస్థాన్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ టాస్ పడకుండానే రద్దయ్యింది. సెప్టెంబర్ 9న ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా సాధ్యపడలేదు. మైదానం చిత్తడిగా మారడం వల్ల మ్యాచ్ తొలి రోజు నుంచి వరుసగా రద్దు అవుతూ వచ్చింది. ఇక ఆఖరి రోజు కూడా వర్షం తీవ్ర అంతరాయం కలిగించడం వల్ల ఆట సాధ్యపడలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
కాగా, 91 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా ఇలా టాస్ కూడా పడకుండానే టెస్టు మ్యాచ్ తొలిసారి రద్దు అయ్యింది. 1933 నుంచి భారత్ టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. ఈ 91ఏళ్లలో ఇప్పటివరకు భారత్ వేదికగా 292 మ్యాచ్‌లు జరిగాయి. ఇక 147ఏళ్ల టెస్టు చరిత్రలో ఓవరాల్‌గా ఒక్క బంతి కూడా పడకుండా రద్దయిన ఎనిమిదో టెస్టుగా ఈ మ్యాచ్ రికార్డులకెక్కింది. ఇక వరల్డ్‌క్రికెట్‌లో 26 సంవత్సరాల తర్వాత టెస్టు మ్యాచ్ రద్దవడం ఇదే తొలిసారి. చివరిసారిగా 1998లో న్యూజిలాండ్- భారత్ (క్యారిస్బుక్, డునెడిన్) మ్యాచ్ రద్దు అయ్యింది.
భారత్‌లోనే ఎందుకు?
ఈ మ్యాచ్‌కు అఫ్గాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ దేశంలో భద్రతా పరిస్థితుల దృష్యా ఐసీసీ వేదికను మార్చాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో భారత్‌ను తటస్థ వేదికగా ఎంపిక చేసింది. ఇక అఫ్గాన్, కివీస్ జట్లు దిల్లీ నుంచి నోయిడాకు ప్రయాణం దగ్గర అవుతుదంన్న ఉద్దేశంతో ఈ స్టేడియాన్ని ఎంచుకున్నారు. అయితే గ్రేటర్ నోయిడా మైదానంలో పిచ్‌ను త్వరగా సిద్ధం చేసేంత సదుపాయాలు లేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.