Yajnavalkya Maharshi History In Telugu :తెలుగు పంచాంగం ప్రకారం నవంబర్ 11వ తేదీ కార్తిక శుద్ధ ఏకాదశి యాజ్ఞవల్క్యుని జయంతి. ఈ సందర్భంగా యాజ్ఞవల్క్యుని జీవిత విశేషాలు తెలుసుకుందాం.
ఎవరీ యాజ్ఞవల్క్యుడు?
వ్యాసుడు శ్రీ మహా విష్ణువు అంశతో జన్మించినవాడు. అటువంటి వ్యాసుడు ప్రతి ద్వాపరంలోనూ అవతరిస్తాడట. ముప్పై మూడో ద్వాపరంలో వ్యాసుడు మహా తేజస్వి అయిన యాజ్ఞవల్క్యుడిగా అవతరించినట్లుగా వైఖానస ఆగమ శాస్త్రం ద్వారా తెలుస్తోంది.
పురాణాలలో యాజ్ఞవల్క్యుని ప్రస్తావన
వేదవ్యాసుడు రచించిన మహాభారతంలోని శాంతిపర్వంలో వివరించిన ప్రకారం వైశంపాయనుడి శిష్యుడైన యాజ్ఞవల్క్యుడు గురువుతో విభేదించి సూర్యారాధన ద్వారా శుక్లయజుర్వేదాన్నీ, శతపథ బ్రాహ్మణాన్నీ దర్శించాడని తెలుస్తోంది. విష్ణుపురాణం, భాగవతం, మరికొన్ని పురాణాలలో యాజ్ఞవల్క్యుడి ప్రస్తావన కనిపిస్తోంది.
అపార జ్ఞాననిధి
యాజ్ఞవల్క్యుడు అవడానికి పేద బ్రాహ్మణుడైనా గొప్ప జ్ఞానం, నీతి నిజాయితీ, తొణకని ఆత్మస్థైర్యం కలిగినవాడు. విదేహ రాజ్యంలో జరిగిన యాజ్ఞవల్క్యుని ఆత్మస్తైర్యం, ఆత్మవిశ్వాసం గురించి వివరించే ఒక సంఘటన గురించి తెలుసుకుందాం.
జనకమహారాజు యజ్ఞం
విదేహ దేశాన్ని పాలించే జనక మహారాజు ఒక గొప్ప యజ్ఞం చేశాడు. యాగానికి వచ్చిన వారందరికీ పెద్ద ఎత్తున దానధర్మాలు చేశాడు. యజ్ఞంలో పాల్గొనడానికి విచ్చేసిన పండితుల కోసం ఒక విద్వత్ సభను ఏర్పాటు చేసాడు. ఆ సభలో ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన చర్చలకు అవకాశం కలుగజేసాడు. బలిష్టమైన వేయి పాడి ఆవులని తెప్పించి, వాటి కొమ్ములను బంగారు నాణాలతో అలంకరించాడు.
సభలో జనకుని ప్రకటన
జనకుడు ఆ సభలో అందరినీ ఉద్దేశించి "బ్రహ్మజ్ఞాని అయినవాడు సభాసదులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి ఈ ఆవులను తోలుకొని వెళ్లవచ్చు" అని సభాముఖంగా ప్రకటించాడు.
పండితుల తర్జనభర్జనలు
అసలే బలిష్టమైన ఆవులు. ఇంకా వాటి కొమ్ములకు బంగారు నాణేలు కూడా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఆవులు, వాటికి బోలెడు నాణేలు. ఎంతో విలువైన పారితోషికం. అందరికీ అందుకోవాలని వుంది. అయితే తగిన అర్హత తమకుందా అని పండితులు తమలో తాము చర్చించుకోసాగారు. శాస్త్ర జ్ఞాన సంపన్నులైన ఆశ్వలుడు, ఆర్త భాగుడు, గార్గి, శాకల్యుడులాంటి వారెంతో మంది అక్కడవున్నా, ముందుకు రావడానికి సాహసించలేక పోతున్నారు.
జనకుని సవాలును స్వీకరించిన యాజ్ఞవల్క్య మహర్షి
ఎవరూ ఊహించని విధంగా యాజ్ఞవల్క్య మహర్షి మాత్రం అందుకు సిద్ధపడ్డాడు. సభలోని పండితులు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. పారితోషికం చేజారిపోతున్నది. దానిని తమ వశం చేసుకోవాలంటే యాజ్ఞవల్క్య మహర్షిని ఎదిరించి, వాదించి, జయించాలి. అది వారికి సాధ్యమని అనిపించలేదు.