Karthika Snanam Significance : తెలుగు పంచాంగం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవ మాసం. శరదృతువులో వచ్చే కార్తీక మాసంలోని అన్ని రోజులూ పర్వదినాలే. ఈ మాసం పవిత్రత గురించి ఎంత చెప్పినా తక్కువే! ముఖ్యంగా కార్తీక మాసంలో చేసే నదీస్నానం అత్యుత్తమం. మరో రెండు రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కానున్న సందర్భంగా కార్తీక స్నాన విశిష్టత గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
కార్తీక మహాత్యం
కార్తీక మాస మహాత్మ్యాన్ని మొదటిగా వశిష్ట మహర్షి జనక మహారాజుకు వివరించగా, శౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు. కార్తీక మాసంలో ఆర్చనలు, అభిషేకాలతో పాటు, స్నాన, దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే. ఈ మాసంలో నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీప దానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు తప్పకుండా ఆచరించాలని శాస్త్రవచనం.
శ్రీ మహావిష్ణువు జలాంతర్యామిగా
కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్ల కాలువలలోనూ నివసిస్తాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ మాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. ఈ మాసం మొత్తంలో కుదరని పక్షంలో కనీసం ఒక్కరోజైనా నదీస్నానం చేయాలని శాస్త్రవచనం. అది కూడా వీలుకాని వారు సూర్యోదయానికి ముందే, స్నానం చేసే నీటిలో గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి , నర్మద, తపతి, సింధు మొదలైన సమస్త నదీజలాలను ఆవాహన చేసుకుని స్నానం చేస్తే నదీ స్నానం చేసిన ఫలితమే దక్కుతుంది.
జ్యోతిష శాస్త్రం ఏమి చెబుతోందంటే!
జ్యోతిష శాస్త్రం ప్రకారం- కృత్తిక నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దానిని కార్తీక మాసంగా పిలుస్తారు. ఈ మాసంలో నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తిమంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు. చంద్ర కిరణాల ఔషధులతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు.
కార్తీక స్నానం వెనుక శాస్త్రీయత
మానవ శరీరం ఉష్ణ శక్తికి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ, బయటకు పోతూ ఉంటుంది. శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణ శక్తిని బయటకు పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం. అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటాం. ఈ ప్రక్రియను "ఎలక్ట్రో మాగ్నెటిక్ యాక్టివిటీ" అంటారు. అందుకే మన పూర్వీకులు ఆధ్యాత్మికం, దేవుడు, భక్తి పేరు చెప్పి కార్తీకం నెల రోజులూ బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేయమనేవారు. ఈ నెల రోజులు ఆ చల్లదనాన్ని తట్టుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని విశ్వాసం.