Why Do We Offer Hair At Tirupati :భక్తుల పాలిట కొంగు బంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడు. తిరుమల దర్శనానికి వెళ్లే వారు కల్యాణకట్టలో స్వామికి తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. అసలు ఏడుకొండలవాడికి తలనీలాలే ఎందుకు ఇస్తారు? అన్న సందేహం మీకు వచ్చిందా! మరి వెంకటేశ్వరుడికి తలనీలాలు ఎందుకు ఇస్తారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.
ఆపద మొక్కులవాడు
జీవితంలో భరించలేని కష్టం వచ్చినప్పుడు, తట్టుకోలేని ఆపదలు వచ్చినప్పుడు కలియుగ దైవం శ్రీనివాసుని భక్తులు, ఈ గండం గట్టెక్కిస్తే కొండకు వచ్చి తలనీలాలు సమర్పిస్తామని కొండల రాయునికి మొక్కుకుంటారు. అదేమీ ఆశ్చర్యమో కానీ ఇక జీవితంలో ఈ ఆపదలు తీరవు అని అనుకున్నవి కూడా స్వామికి మొక్కుకున్న కొద్దిరోజుల్లోనే ఆ గండం గట్టెక్కుతాయని భక్తులు నమ్ముతారు. మరి అందుకేనేమో శ్రీనివాసుని ఆపద మొక్కులవాడు అని భక్తితో పిలుచుకుంటారు.
శ్రీనివాసునికి తలనీలాలే ఎందుకు ఇస్తారు?
శ్రీనివాసునికి తలనీలాలే మొక్కుబడిగా ఎందుకు ఇస్తారంటే మనిషి తెలిసి తెలియకో చేసే పాపాలన్నీ కూడా జుట్టును ఆశ్రయించి ఉంటాయంట! అందుకే స్వామి సన్నిధిలో మొక్కుబడిగా తలనీలాలు ఇస్తే చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని శాస్త్ర వచనం. మనం చేసిన పాపాలు తలనీలాల రూపంలో తీసుకొని మనలను పవిత్రులను చేస్తున్న కరుణామయుడు ఆ ఏడుకొండలవాడని భక్తులు విశ్వసిస్తుంటారు.
అహంకారం, గర్వాన్ని పోగొట్టుకోడానికి గుండు కొట్టించుకోవాల్సిందే!
సాధారణంగా మహిళలు, పురుషుల అందంలో ప్రధాన పాత్ర శిరోజాలదే! అందమైన జుట్టు ఉందని గర్వంతో, అహంకారంతో ఉండేవారికి ఆపదల సమయంలో కనువిప్పు కలిగించడం కోసమే ఆపదలు తీరాక మొక్కుబడిగా తలనీలాలను స్వామికి ఇస్తారు.