Vastu Tips for Trees in Home:హిందువుల్లో చాలా మంది వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలను బలంగా విశ్వసిస్తుంటారు. ఇంటి నిర్మాణం నుంచి మొదలు.. వస్తువుల వరకు అన్నీ వాస్తు ప్రకారం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, ఇంటి ఆవరణలో పెంచే చెట్లను ఎక్కడ పడితే అక్కడ పెంచేస్తుంటారు. కానీ.. ఇలా చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఏ చెట్టును ఏ దిక్కులో పెంచాలో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
"శంఖు చెట్టు అంటే లక్ష్మీ దేవి, విష్ణువు, పరమేశ్వరుడికి, నవగ్రహాల్లోని శనిభగవానుడికి ఇష్టం. ఇలాంటి శంఖు చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే వీరందరి అనుగ్రహం కలిగి అద్భుతంగా అదృష్టం కలిసివస్తుంది. ఐదు సోమవారాలు శివుడిని పూజించి శంఖు పూలను పారే నీటిలో వదిలేస్తే ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. మంగళవారం ఈ పూలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే వ్యాపార పరంగా అభివృద్ధి కనిపిస్తుంది. బుధవారం విష్ణుమూర్తిని శంఖు పూలతో పూజిస్తే వ్యాపార, ఉద్యోగాల్లో తిరుగులేని విజయాలను వస్తాయి. శనివారం నవగ్రహాల్లోని శని విగ్రహం వద్ద శంఖు పూలను పెట్టి పూజించడం వల్ల జాతకంలో శని బలం లేకపోయినా బ్రహ్మాండంగా బలం పెరుగుతుంది. అందుకే శంఖు చెట్టు, పూలకు అంత ప్రాముఖ్యం ఉంది. ఇంటి ఆవరణలో ఈ చెట్టు పెంచినా, పూలతో పూజ చేసినా అద్భుతమైన విజయాలు సొంతం చేసుకోవచ్చు. శంఖు చెట్టును ఏ దిక్కులోనైనా పెంచుకోవచ్చు."
-మాచిరాజు కిరణ్ కుమార్, ప్రముఖ జ్యోతిష్య నిపుణులు
కొబ్బరి, మామిడి: కొబ్బరి, మామిడి చెట్టును ఇంటి ఆవరణలో దక్షిణం దిక్కులో పెంచాలని కిరణ్ కుమార్ తెలిపారు. ఇలా చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని వివరించారు.
పనస చెట్టు: పనస చెట్టును ఇంటి ఆవరణలో పెంచితే చాలా మంచిదని తెలిపారు. ధన లాభం, కుటుంబ పరంగా అదృష్టం కలిసివస్తుందని చెప్పారు. ఇంటి ఆవరణలో తూర్పు దిక్కులో పెంచితే పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారని వివరించారు. దక్షిణం వైపు పెంచితే ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని వెల్లడించారు.
సంపంగి: సంపంగి చెట్టను ఇంటి ఆవరణలో పెంచితే అనేక లాభాలు ఉంటాయని.. దీనిని ఏ దిక్కులోనైనా పెంచుకోవచ్చని తెలిపారు.