Which Place to be Visited First in Tirumala Tour : తిరుమలలో కొలువై ఉన్న కలిగయుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. స్వామి రూపాన్ని కనులారా వీక్షించి ధన్యులు అవుతారు. అయితే, మెజార్టీ జనంతిరుమల(Tirumala)టూర్‌కి వెళ్లినప్పుడు శ్రీవారి దర్శనం మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న దేవాలయాలను దర్శించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలా మందిలో.. సంపూర్ణమైన పుణ్యఫలం దక్కాలంటే.. మొదట తిరుచానూరు అమ్మవారిని దర్శించుకోవాలా? లేదంటే నేరుగా తిరుమల పైకే వెళ్లాలా? లేదంటే ముందు శ్రీ కాళహస్తికి వెళ్లాలా? అనే సందేహాలు వస్తుంటాయి. అసలు ఏవిధంగా తిరుమల యాత్రను స్టార్ట్ చేస్తే పుణ్యఫలాలు లభిస్తాయి? దీనిపై జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మీరు తిరుమల టూర్ ప్లాన్ చేసినట్లయితే ఈ విధంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే పరిపూర్ణమైన యాత్ర ఫలితం లభిస్తుందంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు నండూరి శ్రీనివాస్. ఆయన చెప్పిన వివరాల మేరకు..
- తిరుమల తీర్థయాత్రకు ప్లాన్ చేసినట్లయితే.. మొదటగా కుదురితే ఎప్పుడైనా కాణిపాకం నుంచి తిరుమల టూర్ స్టార్ట్ చేయడం మంచిదదంటున్నారు జ్యోతిష్యులు శ్రీనివాస్. ఎందుకంటే.. అక్కడ ఉన్న వినాయక స్వామి మహా మహిమాన్వితులు. అందుకే మొట్టమొదట ఆయన దర్శనంతో మీ యాత్ర మొదలు పెట్టడం శుభప్రదమంటున్నారు.
- ఆ తర్వాత తిరుచానూరు వెళ్లి అక్కడ పద్మ సరోవరంలో స్నానం చేసి పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాలని చెబుతున్నారు. మొట్టమొదట స్వామి వారి దర్శనం కంటే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని పురాణంలో సుస్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే.. అమ్మవారు కరుణిస్తేనే స్వామివారు అనుగ్రహారిస్తారట.
- ఇక తిరుచానూరు తర్వాత.. తప్పకుండా కపిలతీర్థానికి వెళ్లాలి. అక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోయి తిరుమల దర్శనం చేసుకునే అర్హత వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కపిలతీర్థం తర్వాతనే కొండపైకి వెళ్లడం శుభప్రదమంటున్నారు శ్రీనివాస్. ఇక కొండపైకి వెళ్లాక.. ఒకవేళ మీరు తలనీలాలు ఇవ్వాలనుకుంటే అవి సమర్పించాలి. ఆపై స్వామి పుష్కరిణిలో స్నానం చేయాలి.
- అనంతరం.. వరాహ స్వామి దర్శనం చేసుకోవాలి. ఈయనను దర్శించుకోకుండా శ్రీనివాసుడిని అస్సలు దర్శనం చేసుకోవడం అంత శుభప్రదమైనది కాదంటున్నారు. ఒకవేళ వరాహా స్వామి వారిని అక్కడ దర్శించుకోవడం మర్చిపోతే ఆనంద నిలయంలో మీరు లోపలికి వెళుతూ ఉంటే.. ఎడమ పక్కన ఒక స్తంభంపైన వరాహ స్వామి విగ్రహాం చెక్కి ఉంటుంది. అక్కడైనా స్వామివారిని దర్శించుకుని శ్రీనివాసుని దర్శనానికి వెళ్లడం మంచిదంటున్నారు.
- ఆ తర్వాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుని దర్శనానికి వెళ్లాలి. అనంతరం కొండ దిగి కిందకు వచ్చాక శ్రీ కాళహస్తికి వెళ్లాలి. అక్కడ పరమశివుడిని దర్శించుకొని ఇంటికి వెళ్లడం అత్యంత శుభప్రదమని చెబుతున్నారు జ్యోతిష్యులు నండూరి శ్రీనివాస్.
- అయితే, ఈ క్రమంలోనే చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే.. చివరనే శ్రీ కాళహస్తికి ఎందుకు వెళ్లాలి? అని. నిజానికి పురాణాలలో దీనికి సంబంధించి ఎలాంటి వివరణ లేదు. కానీ తర్వాతి కాలంలో తెలిసిందెంటంటే.. అక్కడ రాహుకేతు పూజలు ఎక్కువగా చేస్తుంటారు. కాబట్టి దోష నివారణ తర్వాత వీలైనంత వరకు ఇంటికి వెళ్లడం శుభప్రదమని చెబుతుంటారు పండితులు. చూశారుగా మీరు తిరుమల టూర్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఇలా పుణ్యక్షేత్రాలను దర్శించుకోండి. సకల శుభాలు, పుణ్య ఫలాలు లభిస్తాయంటున్నారు పండితులు నండూరి శ్రీనివాస్.
NOTE: పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, పురాణాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.