Bikkavolu Ganapati Temple : విఘ్నాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించే స్వామి వినాయకుడు. అందుకే గణనాథుని దేవతలు సైతం ఆరాధిస్తారు. దేశవ్యాప్తంగా గణేశునికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం గణేశుని ఆలయాలన్నింటిలోను ప్రత్యేకమైనది. ఈ ఆలయానికి ఇంతటి ప్రత్యేకత ఎలా వచ్చింది? ఈ క్షేత్ర విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
బిక్కవోలు గణపతి ఆలయం
భక్తులు తమ కోరికలను నేరుగా భగవంతునికి చెప్పుకునే వీలున్న క్షేత్రం బిక్కవోలు గణపతి ఆలయం. చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. ఇక్కడ స్వామిని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకంతో భక్తులు విశేషంగా తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అవేంటో చూద్దాం.
ఏకశిలా మూర్తి
బిక్కవోలు గణపతి ఆలయంలో స్వయంభువుగా వెలసిన స్వామి విగ్రహం ఏకశిలా మూర్తి కావడం విశేషం.
సుందరమైన విగ్రహం - కుడివైపు తొండం
బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామి తొండం కుడి వైపు తిరిగి ఉంటుంది. ఇలా ఉన్న గణపతి శీఘ్రంగా కోర్కెలను నెరవేరుస్తాడని విశ్వాసం. అంతేకాకుండా బిక్కవోలు గణపతి సుమారు ఏడు అడుగుల ఎత్తు కలిగి, పెద్ద పెద్ద చెవులతో ఆకర్షణీయంగా కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. అంతేకాదు గణపతి ఇక్కడ మహారాజ ఠీవి ఉట్టిపడేలా కొద్దిగా వెనక్కి వంగి ఆశీనుడైనట్లు ఉంటాడు.
ఏటా పెరిగే గణపతి
బిక్కవోలు గణపతి ఏటా పెరుగుతూనే ఉంటాడని స్థానికులు అంటారు. ఇందుకు నిదర్శనం గతంలో స్వామివారికి చేయించిన వెండి తొడుగు ప్రస్తుతం చాలకుండా పోవడమేనని భక్తులు అంటారు.