Vastu Shastra for Main Entrance: ఒక ఇంట్లోని కుటుంబసభ్యులు ఎంత కష్టపడుతున్నా సక్సెస్ రావట్లేదంటే దానికి కారణం వాస్తు దోషం ఆని అర్థం చేసుకోవాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఈ వాస్తు దోషం అనేది ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే జరుగుతుందని.. దీనిని వేదా దోషం అనే పేరుతో పిలుస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ వేదా దోషాలు ఎన్ని రకాలు? అవి ఎలా వస్తాయి? దీని వల్ల కలిగే నష్టాలు ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
భవన ఛాయా వేదా దోషం:మీ ఇంటి పక్కన ఉన్న ఇల్లు ఎత్తులో ఉంటే అది చాలా పెద్ద దోషమని నిపుణులు చెబుతున్నారు. దీనిని భవన ఛాయా వేదా దోషం అని పిలుస్తారని తెలిపారు. పక్క భవనం ఎత్తులో ఉండడం వల్ల దాని నీడ మీ ఇంటిపై పడి సక్సెస్ తొందరగా రాదట. మీ ఇల్లు ఎంత పక్కాగా ఉన్నా.. పక్క నివాసం ఎత్తులో ఉంటే ఈ దోషం వస్తుందని చెప్పారు.
వృక్ష ఛాయా దోషం:ఇంకా మీ ఇంటి ముందు పెద్ద చెట్టు ఉంటే దాని నీడ మీ నివాసంపై పడితే వృక్ష ఛాయదోషం వస్తుందని తెలిపారు. దీని వల్ల కూడా జీవితంలో తొందరగా సక్సెస్ రాదని చెబుతున్నారు.
ఆలయ ఛాయా దోషం:అలానే గుడి దగ్గరగా మీ ఇల్లు ఉంటే ఆలయ ఛాయా దోషం ఏర్పడుతుందని.. ఫలితంగా జీవితంలో త్వరగా సక్సెస్ కారని చెబుతున్నారు. ఇలాంటి దోషాలు లేకుండా ఉండాలంటే ఎనిమో మీటర్ అనే ప్రత్యేక పరికరాన్ని ఇంటిపై పెట్టాలని సూచించారు.
స్వర వేదాదోషం:మీ ఇంటి తలుపు తెరిచే, మూసే సమయంలో శబ్ధం ఎక్కువగా వస్తుంటే.. దానిని స్వర వేదాదోషంగా పరిగణిస్తారని చెప్పారు. దీని వల్ల ఇంటి యజమానికి అంతగా అదృష్టం కలిసిరాదట. అందుకే ఎలాంటి శబ్దాలూ రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
అంధక వేదా దోషం:ఇంటి సింహ ద్వారానికి రెండు వైపులా కిటికీలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇలా కాకుండా ఒకవైపే కిటికీ ఉంటే అంధక వేదాదోషం ఏర్పడుతుందని తెలిపారు. ఫలితంగా యజమానికి ఎప్పుడూ ఆరోగ్య సమస్య ఉంటుందని తెలిపారు. అందుకే రెండు వైపులా కిటీకీలు ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.