Dos and Donts in Moudyami 2024: ఉగాది తర్వాత నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాలు జోరందుకున్నాయి. అయితే.. మరో పది రోజులు దాటితే మూఢం వచ్చేస్తోంది. మూడు నెలల వరకు ముహూర్తాలు లేవు. దీంతో.. శుభకార్యాలు ఏవైనా ఉంటే ఈ లోగానే కానివ్వాలని పండితులు సూచిస్తున్నారు. మరి మూఢం అంటే ఏంటి? మూఢాలతో వచ్చే సమస్యేంటి? ఈ రోజుల్లో శుభకార్యాలు చేయొద్దని ఎందుకు అంటారు? చేస్తే ఏమవుతుంది? వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం..
మూఢం అంటే :పురాణాల్లో గ్రహాలు, వాటి సంచారానికి అధిక ప్రాధ్యానత ఉంది. మూఢం అనేది గ్రహాల స్థితి కారణంగా శుభకార్యాలకు అనుకూలంకాని సమయాన్ని సూచిస్తుందట. నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. వీటిలో భూమి కూడా ఓ గ్రహమే. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమ్మీద ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారట. ఈ సమయంలో శుభ కార్యాలు చేయకూడదని అంటారు. ఇక మూఢాలు రెండు రకాలు గురు మూఢం, శుక్ర మూఢం.
గురు మూఢమి/శుక్ర మూఢమి:గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోయి బలహీనమవుతుంది. అలా గురు గ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి. అందుకే.. గురు, శుక్ర గ్రహాలు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెబుతారు. ఎందుకంటే.. ఏ శుభకార్యానికి అయినా గురు, శుక్ర గ్రహాల బలమే ప్రధానం అంటారు. ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలసిరాదని పండితులు చెబుతున్నారు.