Bhaum Pradosh Vrat Katha 2024 :శివపూజలో ప్రదోష కాలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. సూర్యాస్తమయం తర్వాత 2 గంటల 24 నిమిషాలు ప్రదోష కాలంగా పేర్కొంటారు. ప్రదోషం వచ్చే రోజు, తిథిని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి. ప్రతి రోజూ వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషం అనీ, త్రయోదశి రోజు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషం అని అంటారు. ప్రదోష వ్రతాలను త్రయోదశి తిథిలో శుక్ల పక్ష త్రయోదశి, కృష్ణ పక్ష త్రయోదశి రెండింటిలోనూ పాటిస్తారు. ఈ సందర్భంగా జూన్ 4న త్రయోదశి, మంగళవారం వచ్చింది కాబట్టి దాన్ని మనం భౌమ ప్రదోషంగా పేర్కొంటాం. ఇదే రోజు మాసశివరాత్రి కూడా రావడం ఇంకా విశేషం.
ప్రదోషం రోజు ఏ దేవుడిని పూజించాలి
ప్రదోషం రోజు శివపార్వతులని పూజించడం వల్ల మన మనోభీష్టాలు నెరవేరతాయని విశ్వాసం. ప్రదోష వ్రతం మహాదేవుడు శివుడికి అంకితం చేసే శివపార్వతులని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల సుఖసంతోషాలతో జీవిస్తారని నమ్ముతారు. భౌమ ప్రదోషం రోజున చేసే శివపూజలకు కోటి రెట్ల ఫలితం ఉంటుందని శాస్త్ర వచనం.
ప్రదోష పూజా విధి
ఏ రోజైతే త్రయోదశి సూర్యాస్తమయం తరువాత కనీసం 2.30 గంటల సమయం పాటు ఉంటుందో ఆ సమయాన్ని ప్రదోష సమయంగా భావించాలి. ఆ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి, శుచియై శివపార్వతులని మల్లెలతో పూజించాలి. శక్తి ఉన్నవాళ్లు ఉపవాసం ఉంటే చాలా మంచిది. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో సంధ్యా దీపం వెలిగించి నమస్కరించుకోవాలి. శివాష్టకం పఠించాలి.
శివాలయంలో పూజలు ఇలా
అనంతరం శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి, అర్చనలు జరిపించుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు వంటివి దేవుడికి సమర్పించాలి. ప్రదోష వ్రతం కథ చదువుకోవడం లేదా వినడం చేయాలి. ఆ తర్వాత శివునికి భక్తిశ్రద్ధలతో హారతి ఇవ్వాలి. చివరగా పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇంటికి తిరిగి వచ్చాక ఉపవాసాన్ని విరమించవచ్చు.
భౌమ ప్రదోష వ్రతం రోజు ఈ దానాలు చేస్తే శ్రేష్టం
భౌమ ప్రదోష వ్రతం అన్నార్తులకు అన్నదానం చేస్తే మంచిది. ఇంకా వస్త్ర దానం, ఛత్ర దానం చేస్తే మంచిది. ఆలయంలో బ్రాహ్మణులకు ఎర్రని కందులు దానం ఇస్తే మంచిది.
భౌమ ప్రదోష వ్రతం రోజు చేయకూడని పనులు
భౌమ ప్రదోష ఉపవాసం రోజు మాంసాహారం, మద్యం సేవించడం నిషిద్ధం. నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. అలాగే ప్రదోష వ్రతం రోజున శివలింగానికి తులసి, కొబ్బరి నీళ్లు, కుంకుమ సమర్పించకూడదు. ఉపవాసం చేసేవారు భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా పూజ చేయాలి. కోపతాపాలు ఉండకూడదు. చిత్తశుద్ధితో మనసు మొత్తం శివుని మీద లగ్నం చేసి పూజిస్తేనే సత్ఫలితాలు ఉంటాయి.
ప్రదోష వ్రత కథ
పూర్వం ఒక నగరంలో బ్రాహ్మణ మహిళ ఉండేది. ఆమె భర్త చనిపోవడం వల్ల తన స్వశక్తితో కష్టపడి కొడుకులను పోషించుకుంటూ జీవనం సాగించేది. ఒకరోజు బయటకి వెళ్లి తిరిగి వస్తుండగా ఆ బ్రాహ్మణ మహిళకి గాయపడిన స్థితిలో ఉన్న ఒక యువకుడు కనిపిస్తాడు. ఆమె దయతో అతడిని ఇంటికి తీసుకొచ్చి సపర్యలు చేసింది. తర్వాత ఆ కుర్రాడు విదర్భ రాకుమారుడని తెలుసుకుంటుంది. శత్రు సైనికులు అతని రాజ్యం మీద దాడి చేసి, ఆ యువకుని తండ్రిని బందీగా చేసుకుని రాజ్యాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారని తెలుస్తుంది. ఆ రాకుమారుడు, బ్రాహ్మణ మహిళ కుమారులతో కలిసి అక్కడే నివసిస్తూ ఉన్నాడు. ఒకరోజు అన్షుమతి అనే గంధర్వ కుమారి యువరాజుని చూసి ముగ్ధురాలు అవుతుంది. మరుసటి రోజు అన్షుమతి తన తల్లిదండ్రులతో కలిసి యువరాజుని కలుస్తుంది. కొన్ని రోజులకు శివుడు, అన్షుమతి తల్లిదండ్రులకు కలలో కనిపించి వారి పెళ్లి చేయాలని ఆదేశిస్తాడు.
ప్రదోష వ్రత ప్రభావం
బ్రాహ్మణ మహిళ శివుడి పరమ భక్తురాలు. ప్రదోష వ్రతం తప్పనిసరిగా పాటిస్తూ వచ్చేది. ఆమె ప్రదోష వ్రత ఫలితం వల్ల అన్షుమతి తండ్రి అయిన గంధర్వ రాజు తన సైన్యంతో కలిసి యువరాజు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న విదర్భ మీద దాడి చేసి విజయం సాధిస్తాడు. శత్రువులని తరిమేసి యువరాజు తండ్రిని కూడా బందీల నుంచి విముక్తుడిని చేస్తాడు. అందుకే ప్రదోష వ్రతం నాడు ఉపవాసం ఉండి శివుడిని ఆరాధిస్తే భక్తుల కోరికలు తప్పకుండా నెరవేరతాయని నమ్ముతారు. యువరాజు ఆ బ్రాహ్మణ మహిళ ఆశ్రయాన్ని పొందిన తర్వాతనే తన కష్టాల నుంచి విముక్తి పొంది తన తండ్రిని కూడా శత్రు రాజుల నుంచి విడిపిస్తాడు. అందుకే ప్రదోష వ్రతానికి అంతటి ప్రాముఖ్యం ఉంది. జూన్ 4 వ తేదీ రానున్న భౌమ ప్రదోష వ్రతం రోజు మనం కూడా ఆ శివుని ఆరాధిద్దాం. మన మనోభీష్టాలను నెరవేర్చుకుందాం.
ఓం నమః శివాయ
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
చర్మవ్యాధులను తగ్గించే శివయ్య- గర్భిణీలను రక్షించే పార్వతమ్మ- ఆలయం ఎక్కడుందంటే? - Shiva Parvathula Aalayam