Vishnu Dutt Story: శ్రీగురు చరిత్రలోని విష్ణు దత్తుని కథ మనకు అసలైన గురుభక్తిని సూచిస్తుంది. ఒక ఊర్లో విష్ణు దత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు శ్రీ దత్తాత్రేయుని భక్తుడు. సర్వకాల సర్వావస్థల్లోనూ దత్తాత్రేయుని ఆరాధిస్తూ ఉండేవాడు. ఈ విష్ణు దత్తునికి జీవితంలో ఒక్కసారైనా దత్తాత్రేయుని దర్శనం చేసుకొని, తరించాలని తపన ఉండేది. ప్రతిరోజూ అతడు సంధ్య వార్చుకొని, ఆ నీళ్లు తన ఇంటి ముందు ఉన్న రావి చెట్టు మొదల్లో పోసేవాడు.
విష్ణు దత్తుని భార్య సుశీలమ్మ పరమ సాధ్వి. భర్తకు తగిన భార్య అయిన ఆమె తన ఇంటికి వచ్చిన అతిథులను ఆదరించి, భోజనం పెట్టి పంపేది. అయితే వారి ఇంటి ముంగిట్లో ఉండే రావి చెట్టు మీద ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు. విష్ణు దత్తుడు రోజూ సంధ్య వార్చిన నీళ్లు చెట్టు మొదట్లో పోసినందున వల్ల గాయత్రీ మంత్రం ప్రభావం చేత ఆ రాక్షసునికి శాపం తీరి తన లోకానికి వెళ్లిపోతూ, విష్ణు దత్తుడి పిలిచి ఇలా అంటాడు. స్వామీ మీదయ వల్ల నాకు శాపం తీరింది మీకు ఏదైనా ఒక ఉపకారం చేసి పోవాలని అనుకుంటున్నాను. మీ కోరిక ఏమిటో చెప్పండి అని అడిగాడు. దానికి విష్ణుదత్తుడు, నాయనా నాకు శ్రీ దత్తుడి దర్శించుకోవాలనే కోరిక వుంది నీకు చేతనైతే అది చేయించు చాలు అన్నాడు.
దత్తుడిని నువ్వే గుర్తుపట్టాలి!
బ్రహ్మరాక్షసుడు విష్ణు దత్తుడితో నేను నీకు మూడు సార్లు మాత్రమే దత్తుడి చూపిస్తాను. నీవు అతడిని గుర్తుపట్టక పోతే నేనేమి చేయలేను అని అనగా అందుకు విష్ణుదత్తుడు ఒప్పుకుంటాడు. అప్పుడు బ్రహ్మరాక్షసుడు విష్ణు దత్తుని తనతో తీసుకెళ్లి ఒక తాగుబోతును చూపించి అతడే దత్తుడు నీవు వెళ్లి కాళ్ల మీద పడు అని చెప్పాడు. కానీ విష్ణు దత్తునికి ఆ తాగుబోతును చూస్తే అసహ్యం కలిగి, అతని దగ్గరికి పోకుండా తిరిగి ఇంటికి వెళ్లి పోతాడు.
నా లోకానికి వెళ్లిపోతా!
రాక్షసుడు విష్ణు దత్తుడితో ఏమి తిరిగి వచ్చినావు అంటే నాకు దత్తుడి చూపించమంటే తాగుబోతును చూపించావు అందుకే తిరిగి వచ్చేశానని అంటాడు. అప్పుడు బ్రహ్మరాక్షసుడు రెండోసారి విష్ణు దత్తుడి తీసుకెళ్లి ఒక స్త్రీని తన తొడమీద కూర్చో బెట్టుకొని ముచ్చట్లాడుతున్న ఓ వ్యక్తిని చూపి అతడే దత్తుడు వెళ్లి అతని పాదాలపై పడి శరణు వేడుకో అంటాడు. కానీ కామానికి వశుడై ఉన్న అతడిని చూసి అతడే దత్తాత్రేయుడంటే విష్ణు దత్తుడికి నమ్మకం కలుగ లేదు. మళ్లి తిరిగి వచ్చేస్తాడు. చివరకు బ్రహ్మరాక్షసుడు విష్ణుదత్తుడితో ఇలా అంటాడు ఇదే నీకు చివరి అవకాశం. దత్తాత్రేయుడు తన భక్తులకు పరీక్ష పెడుతుంటాడు. నీవు ఈసారి దత్తుడి శరణు కోరకుంటే నేను ఇక ఏమి చేయలేను నా లోకానికి వెళ్లిపోతాను అంటాడు. బ్రహ్మరాక్షసుడు, విష్ణుదత్తుడు ఇద్దరూ కలిసి శ్మశానానికి వెళ్తారు. అక్కడ శవాలతో ఉన్న ఓ వ్యక్తిని చూపి బ్రహ్మరాక్షసుడు ఆయనే దత్త ప్రభువు అని చెప్పుతాడు. విష్ణు దత్తుడు వెళ్లి భక్తితో అయన కాళ్లు గట్టిగా పట్టుకుంటాడు.
నిజరూపంలో దర్శనం
అప్పుడు దత్తాత్రేయస్వామి విష్ణుదత్తుడికి తన నిజరూప దర్శనం ఇచ్చి భక్తా ఏమి కావాలో కోరుకో అని అడుగాడు. కానీ, విష్ణు దత్తుడికి ఏమీ కోరాలో తెలియక ప్రభూ నేను ఇప్పుడే ఇంటికి వెళ్లి నా భార్యను అడిగి వస్తానని వెళ్ళాడు. తన భార్య సుశీలమ్మకు దత్తుడు దర్శనం గురించి చెప్పి ఆయనను ఏమి కోరుకుందామని అడుగగా ఆమె మరో రెండు రోజుల్లో మీ తండ్రి గారి ఆబ్దికం వస్తుంది కదా దానికి దత్త స్వామిని భోక్తగా రమ్మని పిలవండి అని చెప్పుతుంది.