Vijaya Ekadashi Vrata By Lord Rama : ఏ వ్రతమైనా పూజ పూర్తయ్యాక వ్రతకథను చదువుకొని శిరస్సున అక్షింతలు వేసుకుంటేనే వ్రతఫలం పూర్తిగా దక్కుతుందని విశ్వాసం. విజయ ఏకాదశి రోజు ఉపవాస నియమాలు పాటించినా లేకున్నా ఈ వ్రత కథ విన్నా, చదివినా కోరిన కోర్కెలు నెరవేరి సర్వ కార్యాల్లోనూ విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు.
శ్రీరాముడు ఆచరించిన విజయ ఏకాదశి
వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం, శ్రీరాముడు ఈ వ్రతాన్ని ఆచరించి విజయాన్ని పొందాడని తెలుస్తోంది. ఆ కథేమిటో చూద్దాం.
విజయ ఏకాదశి వ్రత కథ
శ్రీరామ చంద్రుడు ఆచరించిన విజయ ఏకాదశి వ్రత కథని చదవడం వలన ఏకాదశి వ్రతమాచరించిన పుణ్యం లభిస్తుందంటారు. రావణుడి చెరలో ఉన్న సీతాదేవిని విడిపించేందుకు శ్రీరామచంద్రుడు లంకకు చేరుకునే సన్నాహాల్లో ఉన్నాడు. సముద్రాన్ని దాటి వానర సైన్యం లంకకు ఎలా చేరుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఆ సమయంలో లక్ష్మణుడు అక్కడ సమీపంలోని ఆశ్రమంలో నివసిస్తున్న బకదళాభ్యుడనే ఋషి వద్దకు వెళ్ళి సహాయం కొరదామని సలహా ఇస్తాడు. అందుకు అందరూ అంగీకరించి ఆ రుషి ఆశ్రమానికి వెళతారు. తన ఆశ్రమంలో అడుగుపెట్టిన శ్రీరామచంద్రుడిని చూసి సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే వచ్చాడని తెలుసుకున్నాడు బకదళాభ్యుడు. అయినప్పటికీ రావణుడిని జయించి విజయం సిద్ధించాలంటే విజయ ఏకాదశి రోజు ఉపవాస దీక్ష చేస్తే విజయం ప్రాప్తిస్తుందని తన బాధ్యతగా సూచన చేశాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు విజయ ఏకాదశి వ్రతం ఆచరించాడు. ఆ తర్వాత సముద్రంపై సేతువు నిర్మించి వానరులతో సహా లంకకు చేరుకుని రావణుడిని జయించి సీతాదేవిని తిరిగి తీసుకొచ్చాడు. శ్రీరామునికి విజయ ఏకాదశి వ్రతం ఫలితం వల్లే ఈ విజయం సిద్ధించిందని చెబుతారు.
ఇంకో కథనం
ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని సలహా మేరకు యుధిష్టురుడు తదితర పాండవులు కూడా విజయ ఏకాదశి వ్రతం ఆచరించి కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించినట్లుగా తెలుస్తోంది. జై శ్రీమన్నారాయణ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం