Vastu Tips for Overcome Depression : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కువ మందిని ఇబ్బందిపెడుతున్న సమస్య డిప్రెషన్. దీనికి కారణాలు అనేకం. అయితే ఒక్కసారి డిప్రెషన్‌కి గురైతే మానసికంగా చిత్తు కావడం ఖాయం. ఈ క్రమంలోనే చాలా మంది ఈ ఒత్తిడిని జయించేందుకు మందులు కూడా ఉపయోగిస్తుంటారు. అయినా కొద్దిమందిలో మార్పు మాత్రం ఉండదు. అలాంటి వారి కోసం వాస్తు శాస్త్రంలో కొన్ని చిట్కాలు ఉన్నాయంటున్నారు వాస్తు నిపుణులు. ఆ టిప్స్ పాటించడం వల్ల డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారంటున్నారు. ఇంతకీ అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
లైట్ గ్రే కలర్-ఇది డిప్రెషన్ తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఈ లైట్ కలర్ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు ఒత్తిడికి గురైనప్పుడు లైట్ గ్రే కలర్ దుస్తులు ధరిస్తే దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. అదే విధంగా మీ లివింగ్ రూమ్ గోడలు కూడా లేత బూడిద రంగులో ఉంటే అది మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
లైట్ పింక్ కలర్ - ఈ కలర్‌ను లేత గులాబీ రంగు అంటారు. ఇది చాలా సున్నితమైన రంగు. మనసును ప్రశాంతంగా ఉంచడంలో ఈ కలర్ అత్యంత ప్రభావవంతమైనదని నిపుణులు అంటున్నారు. కాబట్టి లైట్ పింక్ కలర్ దుస్తులను ధరించడం వల్ల ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చని అంటున్నారు.
లావెండర్ :వాస్తు ప్రకారం ఈ కలర్ కూడా ఒత్తిడిని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి మీరు స్ట్రెస్‌కు గురైనప్పుడు లావెండర్ కలర్ దుస్తులను ధరించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు వాస్తు నిపుణులు. అదే విధంగా మీ ఇంటి గోడలపై కూడా ఈ రంగు పేయింట్ వేయిస్తే ప్రశాంతత లభిస్తుంది. రిలాక్స్డ్ లుక్ కోసం ఈ కలర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు.