Vastu Tips for Newly Wed Couple Bedroom : ప్రస్తుతం మాఘ మాసం స్టార్ట్ కావడంతో పెళ్లిళ్లు ఊపందుకోనున్నాయి. ఈ క్రమంలోనే కొత్తగా పెళ్లైన జంట తమ బెడ్రూమ్లో వాస్తు దోషాలు లేకుండా జాగ్రత్త పడాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. నూతన వధువరులు కొత్త జీవితాన్ని కలిసి ప్రారంభించేముందు పడకగదిని వాస్తుకు అనుగుణంగా డెకరేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే బెడ్రూమ్(Bedroom)లోని వస్తువులన్నీ వాస్తుకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. అలా ఉండడం వల్ల దంపతుల బంధం మరింత బలపడడమే కాకుండా జీవితం సుఖసంతోషాలతో నిండి ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ, వాస్తుప్రకారం కొత్తగా పెళ్లైన వారు బెడ్రూమ్ను ఎలా అలంకరించుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
బెడ్రూమ్ డైరెక్షన్ : వాస్తుప్రకారం.. కొత్తగా పెళ్లైన వారి బెడ్రూమ్ ఆగ్నేయ దిశలో ఉండాలి. అది భవనంలో పై అంతస్తులో ఉంటే ఇంకా మంచిది. ఒకవేళ అలా లేకపోతే నూతన దంపతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అటువంటి పరిస్థితులలో వధువు తల గది దక్షిణ దిశకు.. పాదాలు ఉత్తర దిశకు ఎదురుగా ఉండేలా బెడ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయమేమిటంటే.. పెళ్లికూతురు పాదాలు బెడ్రూమ్ ఎంట్రన్స్ లేదా గది తలుపు వైపు ఉండకుండా చూసుకోవాలి. ఇదీ సాధ్యం కాకపోతే వధువు తల తూర్పు దిశకు ఎదరుగా ఉండేలా మంచాన్ని సెట్ చేసువాలి. అయితే గర్భం దాల్చాల్సి వచ్చినప్పుడు స్లీపింగ్ పొజిషన్ మార్చుకోవాల్సి ఉంటుందని మీరు గమనించాలి.
మంచం ఎలా ఉండాలి?
వాస్తుప్రకారం.. బెడ్రూమ్లో చెక్క మంచాన్ని ఏర్పాటుచేసుకోవడం మంచిది. ఎందుకంటే మెటల్‌తో తయారు చేసిన మంచం కోల్డ్ ఎనర్జీని కలిగి ఉంటుంది. అదే చెక్కతో తయారుచేసినదానికి వార్మ్ ఎనర్జీ ఉంటుంది. కొత్తగా పెళ్లైన వారికి వార్మ్ ఎనర్జీ అవసరం కాబట్టి చెక్క మంచం ఉండేలా చూసుకోవాలంటున్నారు వాస్తు నిపుణులు. అదేవిధంగా మంచానికి బాక్స్ ఉన్నట్లయితే అందులో వ్యర్థాలను డంప్ చేయకూడదు. పదునైన వస్తువులను అందులో ఉంచకూడదు. ఇవి మాత్రమే కాదు పరుపు కూడా సింగిల్ ఉండాలనే విషయం మీరు గుర్తుంచుకోవాలి.
అద్దం ఎలా ఉంచాలి?
బెడ్రూమ్లో వాస్తుప్రకారం ఒక అద్దం ఉంటే మంచిది. అయితే దానిని సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మీరు నిద్రిస్తున్నప్పుడు అద్దంలో కనిపించకుండా ఉండాలంటే.. అద్దం ఎప్పుడూ బెడ్‌కు కాస్త దూరంగా పక్కన వైపు ఉండేలా చూసుకోవాలంటున్నారు. అలాగే ఎప్పుడు అద్దాన్ని మంచానికి ఎదురుగా ఏర్పాటు చేయకూడదంటున్నారు వాస్తు నిపుణులు.