Vastu Methods for House Construction :"ఇదే నా ఇల్లు" అని తన ఇంటిని చూపించాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ప్రతీ మనిషి కనీస అవసరం అది. కానీ, చాలా మంది జనానికి నివాసం ఒక స్వప్నంగానే మిగిలిపోతూ ఉంటుంది. ఇక, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇంటి స్థలం కొనుగోలు చేయాలంటే సాధారణ జనానికి సాధ్యం కాదు. అయితే, వాస్తుకు సరిగా లేని ప్లాట్లు, నాలుగు మూలలూ సరిగా లేని స్థలాలు తక్కువ ధరకు అమ్మకానికి ఉంటాయి. అలాంటి వాటిల్లోనూ వాస్తు ప్రకారమే చక్కగా ఇల్లు కట్టుకోవచ్చని వాస్తు నిపుణుడు పి.కృష్ణాదిశేషు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీలు పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని ఎకరాల భూములు కొనుగోలు చేసి, వాస్తు ప్రకారమే ప్లాట్లుగా విభజించి, ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే, భూముల కొనుగోలు సర్వే నంబర్ల ఆధారంగా ఉంటుంది. కాబట్టి, కొనుగోలు చేసిన భూములు కొన్నిసార్లు నాలుగు మూలలూ సరిగా ఉండకపోవచ్చు. వాస్తు ప్రకారంగా దిక్కులు సరిగా లేక వంకరగా ఉండొచ్చు. ఇలాంటి వెంచర్లలో ప్లాట్ల విభజన చేసినప్పుడు, మూలల్లో వాస్తు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. రోడ్లు వంపులు తిరిగినచోట, ఏటవాలుగా ఉన్నచోట, చెరువులు, గుట్టలు, నదులు, కొండల ప్రాంతాల్లోని స్థలాల్లో ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి.
ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న స్థలాల్లో, నివాసాలను నాలుగు దిక్కులకు అనుగుణంగా నిర్మించడం సాధ్యం కాదు. ప్లాట్లను సరిగ్గా వాస్తు ప్రకారం నిర్మిస్తే మూలల్లో కొంత భూమిని వృథాగా వదిలేసుకోవాల్సి వస్తుంది. కమర్షియల్ ఏరియాల్లో ఉన్న భూముల్లో ప్రతి గజమూ ఎంతో విలువైనదిగా ఉంటుంది. అదేవిధంగా తక్కువ స్థలాన్ని కొనుగోలు చేసిన మధ్యతరగతి వర్గాలకూ భూమిని వృథాగా కోల్పోవడం కష్టంగా ఉంటుంది. అయితే, ఇలాంటి పరిస్థిని ఎదుర్కొనేవారు చక్కగా ఇళ్లు నిర్మించుకోవచ్చని కృష్ణాదిశేషు సూచిస్తున్నారు.
"పంక్తి శోభ" పద్ధతిలో
వాస్తు ప్రకారం దిక్కులకు లేని స్థలాల్లోనూ ఇళ్లు నిర్మించుకోవచ్చని, ఈ పద్ధతిని పంక్తి శోభగా పిలుస్తారని చెబుతున్నారు. ఈ పద్ధతి గురించి కొన్ని వాస్తు గ్రంథాలు వివరిస్తున్నాయని వెల్లడించారు. రోడ్లకు ఆనుకుని నిర్మించే ఇళ్లలో నివసించే వారికి గాలి, వెలుతురు సమృద్ధిగా అందుతుందని, తద్వారా జీవన మనుగడకు ఎలాంటి లోటూ రాదని, కాబట్టి ఇది శాస్త్ర సమ్మతమేనని చెబుతున్నారు.