Vasant Panchami Significance In Telugu : మాఘమాసం పెడుతూనే వచ్చే తొలి పండుగ వసంత పంచమి. వసంత ఋతువు ఆరంభంలో వచ్చే వసంత పంచమి రోజు చదువుల తల్లి సరస్వతి దేవి ఆరాధనకు శ్రేష్టమైనది. వసంత పంచమి సందర్భంగా ఈ కథనంలో వసంత పంచమి విశిష్టత, వసంత పంచమి పూజా విధానం గురించి తెలుసుకుందాం.
చదువుల తల్లి జన్మదినమే శ్రీ పంచమి
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసం శుక్ల పక్షంలో ఐదో రోజు అయిన పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటాం. వసంత పంచమినే శ్రీ పంచమి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం సరస్వతీ దేవి జన్మించిన రోజునే మనం శ్రీ పంచమిగా జరుపుకుంటాం.
వసంత పంచమి ఎప్పుడు?
ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 :28 నిమిషాలకు మాఘ శుద్ధ పంచమి తిథి మొదలై, ఫిబ్రవరి 3 వ తేదీ సోమవారం ఉదయం 10 :13 నిమిషాల వరకు ఉంది. సూర్యోదయంతో తిథిని అనుసరించి పండుగలు జరుపుకోవాలి కాబట్టి ఫిబ్రవరి 3 వ తేదీనే వసంత పంచమి పండుగ జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు పూజకు శుభ సమయం.
వసంత పంచమి విశిష్టత
సరస్వతీ దేవి ఆశీస్సులు ఉన్న వారి జీవితాల్లో అజ్ఞానమనే చీకట్లు తొలగిపోయి జ్ఞానమనే వెలుగులు నిండుతాయని నమ్మకం. అందుకే వసంత పంచమి రోజున సంగీతం, కళల దేవత, విద్యా దేవత అయిన సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పేర్లు వేరైనా పండుగ ఒక్కటే!
వసంత పంచమి రోజును దేశంలోని అనేక ప్రాంతాలలో వాగీశ్వరి జయంతి, రతి కామ మహోత్సవం, వసంతోత్సవం ఇలా రకరకాల పేర్లతో అనేక ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
ఇవి తప్పకుండా చేయాల్సిందే!
పరమ పవిత్రమైన వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలని పెద్దలు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల సరస్వతీ దేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని విశ్వాసం. అవేమిటంటే సరస్వతీ దేవి పూజా సమయంలో కొత్త పుస్తకాలు, పెన్ను లేదా పెన్సిళ్లను పూజించాలి. అదే విధంగా ఈ రోజున కళలకు ఉపయోగించే వస్తువులను కూడా పూజిస్తారు. ముఖ్యంగా సంగీత వాయిద్యాల వంటి వాటిని ఈ రోజు ప్రత్యేకంగా పూజించడం వలన కళలలో నిష్ణాతులు అవుతారని విశ్వాసం. వసంత పంచమి రోజున దేవాలయాలతో పాటు పాఠశాల, కళాశాలల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
వసంత పంచమి పూజా విధానం
వసంత పంచమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచియై సరస్వతీదేవి పటాన్ని గంధం, కుంకుమలతో అలంకరించాలి. ఈ రోజున సరస్వతీ దేవిని పసుపు రంగు పూలతో అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. అలాగే పసుపు రంగు వస్త్రం, పసుపు రంగులో ఉండే ప్రసాదాలను అమ్మవారికి సమర్పించాలి. అలాగే ఈ రోజు సరస్వతి ఉపాసన చేసేవారు పసుపు రంగు దుస్తులు ధరించి, పసుపు రంగులోని ఆహారాన్ని తినడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన కుంకుమ పువ్వు కలిపిన పాయసాన్ని నివేదించాలి.
సరస్వతి దేవికి అక్షర నీరాజనం
సరస్వతీ దేవి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలంటే అమ్మవారిని 'సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణి' అనే ప్రార్ధన శ్లోకాలతో పాటు సరస్వతి అష్టోత్తర శతనామాలతో గాని, సహస్రనామాలతో గాని అర్చించాలి.
తొలగిపోయే గ్రహదోషాలు
అంతే కాదు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, చంద్రుడు, గురుడు, శుక్రుడు, బుధ గ్రహాల దోషాలు ఉండే వారు వసంత పంచమి రోజున పూజలు చేయడం వల్ల ఆ గ్రహాల ప్రతికూల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు.
ఈ నియమాలు తప్పనిసరి
వసంత పంచమి రోజు సరస్వతీ దేవి ఆరాధన చేసేవారు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆ సరస్వతీ దేవి ఆశీస్సులు మనకు పరిపూర్ణంగా లభించి సకల విద్యలు, సకల కళలు మన సొంతమవుతాయి. విద్యార్థులు పరీక్షలలో మంచి విజయాలను సొంతం చేసుకుంటారు.
అక్షరాభ్యాసం
శ్రీ పంచమి రోజు చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేసి వారి విద్యాభ్యాసం మొదలుపెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారనే నమ్మకంతో ఈ రోజున చిన్న పిల్లలకు ఆ సరస్వతి దేవి సమక్షంలో అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆలయాలలో ఇలా
వసంత పంచమి రోజు బాసర, వర్గల్ వంటి ఆలయాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే సరస్వతి దేవి సమక్షంలో చిన్న పిల్లలకు అక్షరాభ్యాసాలు ఘనంగా జరుగుతాయి. మనందరం కూడా ఈ వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజిద్దాం. సకల జ్ఞానాన్ని పొందుదాం. ఆ చదువుల తల్లి దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ సరస్వతి దేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.