Vasant Panchami 2025 Special Prasadam: ప్రతీ సంవత్సరం మాఘ మాసం శుక్ల పక్షం ఐదవ రోజున వసంత పంచమిని జరుపుకుంటారు. ఈ పండగ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవిని పూజిస్తారు. అమ్మవారిని ఆరాధిస్తే మంచి జ్ఞానం, చదువు వస్తుందని భక్తుల విశ్వాసం. వసంత పంచమిని పలు ప్రాంతాల్లో బసంత్ పంచమి, శ్రీ పంచమి, సరస్వతీ పంచమి, మాఘశుద్ధ పంచమి అని కూడా పిలుస్తారు. ఈ పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఫిబ్రవరి 2 వసంత పంచమిని పురస్కరించుకుని అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
కేసర్ శ్రీఖండ్:
కావాల్సిన పదార్థాలు:
- బాగా మీగడ కలిగిన చిక్కటి పెరుగు - 1 కప్పు
- పంచదార - అర కప్పు
- కుంకుమపువ్వు- పావు టీస్పూన్
- పాలు - 1 టేబుల్ స్పూన్
- యాలకుల పొడి- పావు టీస్పూన్
- గార్నిష్ కోసం బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్
తయారీ విధానం:
- గిన్నెలోకి పాలు తీసుకుని అందులో కుంకుమ పువ్వు వేసి ఓ అరగంట సేపు నాననివ్వాలి.
- ఇప్పుడు ఓ బౌల్లోకి పెరుగు వేసి చిక్కగా, మృదువుగా మారేవరకు విస్కర్‌తో బీట్ చేయాలి.
- పెరుగు బాగా కలిపిన తర్వాత పంచదార వేసి అది కరిగే వరకు బీట్ చేయాలి.
- ఆ తర్వాత కుంకుమపువ్వు పాలు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని కనీసం 2 గంటలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి.
- ఆ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసి డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుంటే కేసర్ శ్రీఖండ్రెడీ. దీనిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత తినాలి.