Vaikunta Ekadasi 2025 Date :హిందువులకు వైకుంఠ ఏకాదశి అత్యంత ప్రత్యేకమైనదిగా పండితులు చెబుతారు. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే 'ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, వైకుంఠ ఏకాదశి' అని పిలుస్తారు. ఈ రోజున ప్రతి ఆలయంలోనూ ఉత్తర ద్వారం నుంచి స్వామి దర్శనంకల్పిస్తారు. ఇలా దర్శించుకున్నవారికి పునర్జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని వేదవాక్కు. అందుకే ఆ రోజును 'మోక్షద ఏకాదశి' అని కూడా పిలుస్తారు. అయితే, ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏ రోజున వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారో చాలా మందికి సందేహంగా ఉంది. ఈ స్టోరీలో మనం దర్శనాలు ఏ రోజున ప్రారంభమవుతాయో తెలుసుకుందాం.
24 ఏకాదశి తిథులు
మార్గశిర మాసం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైందని చెబుతారు. ఈ నెలలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది. నెలకు రెండు చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. ఏడాదిలో వచ్చే మిగతా ఏకాదశి తిథులతో పోలిస్తే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశినే 'వైకుంఠ లేదా ముక్కోటి ఏకాదశి'గా పిలుస్తారు.
ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయనీ, మహావిష్ణువు గరుడ వాహనంపైన 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడనీ చెబుతుంటారు. అందుకే ప్రతి వైష్ణవాలయాల్లో ఈ రోజున మాత్రమే వైకుంఠాన్ని తలపించేలా ఉత్తరద్వారాలను తెరుస్తారు. భక్తులు తెల్లవారుజామున ఆ ద్వారం గుండా లోపలికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటారు. అత్యంత పవిత్రమైన ఈ రోజున మూడు కోట్ల ఏకాదశి తిథులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్లే దీనికి 'ముక్కోటి ఏకాదశి' అనే పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలను పఠించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.