తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

'మంగళ'వారం కొత్త పనులకు చాలా మంచిది- ఈ దేవతను పూజిస్తే శుభఫలితాలు మీ సొంతం - tuesday importance in hinduism

Tuesday Importance In Hinduism : హిందూ ధర్మ శాస్త్రం మానవులు ఎదుర్కొనే కఠినమైన సమస్యలకు ఉపశమనంగా కొన్ని పూజలను సూచించింది. మంగళవారం నియమనిష్టలతో దుర్గా దేవిని ఆరాధిస్తే వివాహం ఆలస్యం కావడం, సంతానం లేకపోవడం వంటి సమస్యలు తొలగిపోతాయి. అయితే దుర్గా దేవిని ఎలా పూజించాలి, ఆ విధి విధానాలు ఏమిటో తెలుసుకుందాం.

Tuesday Durga Puja At Home
Tuesday Durga Puja At Home

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 7:40 AM IST

Tuesday Importance In Hinduism :మంగళవారం దుర్గాదేవి పూజకు విశిష్టమైనది. ఈ రోజు ముఖ్యంగా రాహుకాలంలో అమ్మవారిని పూజిస్తే అవివాహితులకు వివాహ ప్రాప్తి, వివాహితులకు దీర్ఘ సుమంగళితనం, సంతానం కోరుకునే వారికి సత్సంతానం కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. మరి ఆ పూజలు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రాహుకాల పూజ ఎలా చేయాలి
ఒక రోజులో 90 నిముషాలపాటు అంటే గంటన్నర సమయం రాహుకాలం ఉంటుంది. ఇది ప్రతి రోజూ ఒకేలా ఉండదు. ఒక్కోరోజు ఒక్కో సమయంలో రాహుకాలం ఉంటుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 :30 గంటల వరకు రాహుకాలం ఉంటుంది.

మంగళవారం మంగళ కరం
కొంతమంది మంగళవారం మంచిది కాదని ఆ రోజు ఏ పనులు చేయరు. కానీ మంగళవారానికి జయవారం అని మరో పేరు కూడా ఉంది. అంటే జయాన్ని కోరుకునేవారు మంగళవారం మంచి పనులు మొదలు పెట్టవచ్చు. అంతేకాదు వైద్యానికి, విద్యకు సంబంధించిన ముఖ్యమైన పనులు చేయడానికి మంగళవారం శ్రేష్టమని శాస్త్రం చెబుతోంది. కాబట్టి పనుల్లో జయం కోరుకునే వారు మంగళవారం ముఖ్యమైన పనులు చేయవచ్చు.

మంగళవారం దుర్గాదేవి ఆరాధనకు శ్రేష్టం
దుర్గాదేవి ఆరాధనకు మంగళవారం శ్రేష్టమని దుర్గాదేవి ఉపాసకులు చెబుతుంటారు. అందుకే మంగళవారం చేసే రాహుకాల పూజకు చాలా విశిష్టత ఉంది. దుర్గాదేవి రాహుగ్రహానికి అధిదేవత కాబట్టి మంగళవారం రాహుకాలం సమయంలో దుర్గాదేవిని స్మరిస్తూ పూజ చేస్తే రాహు దోషాలు పోతాయని జ్యోతిషశాస్త్ర పండితులు చెబుతున్నారు.

మంగళవారం రాహుకాల పూజ చేసే విధానం
మంగళవారం రాహుకాల పూజ చేయాలనుకున్నవారు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచియై పూజామందిరంలో ప్రతి రోజూలానే పూజ చేయాలి. తర్వాత ఆ పూజ ముగించుకొని అమ్మవారి సమక్షంలో మనసులోని కోరికను చెప్పుకొని రాహుకాల పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత సమీపంలోని దుర్గాదేవి ఆలయానికి వెళ్లాలి.

దుర్గాదేవికి నిమ్మకాయల పూజ
దుర్గాదేవి ఆలయంలో ఒక ప్రాంతాన్ని ఎంచుకుని నేలను నీటితో శుభ్రం చేసుకొని పద్మం ఆకారంలో ముగ్గు వేసుకోవాలి. పసుపు కుంకుమ పూలు ముగ్గు మధ్యలో అలంకరించాలి. ఇప్పుడు పసుపు రంగులోని నిమ్మకాయను రెండుగా కోసి వాటిలోని రసాన్ని తీసి వేసి నిమ్మకాయ చెక్కలు వెనుకవైపు నుంచి మెల్లగా ఒత్తుతూ ప్రమిదలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆవునేతిని పోసి, రెండు ఒత్తులు వేసి అమ్మవారి ఎదుట దీపారాధన చేయాలి. దీపారాధనకు కుంకుమ అలంకరించాలి. ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత పూజారి, అమ్మవారి పేరు మీద అర్చన జరిపించుకోవాలి. అమ్మవారికి మూడు ప్రదక్షిణలు చేయాలి. ఈ పూజ తర్వాత నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయరాదు. దేవాలయం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఉపవాసం విరమించవచ్చు.

సకల కార్య సిద్ది రాహుకాల పూజ
ఈ విధంగా 3 వారాలు కానీ, 5 వారాలు కానీ, 9 వారాలు కానీ. 11 వారాలు కానీ నియమబద్ధంగా రాహుకాల పూజ చేస్తే రాహు గ్రహ దోషాలు, కుజ దోషాలు పోతాయి. దుర్గాదేవి అనుగ్రహంతో వివాహం కోరుకునే వారికి వివాహం, సంతానం కోరుకునే వారికి సంతానం, అందరికీ అమ్మవారి అనుగ్రహంతో సుమంగళి తనం తప్పకుండా సిద్ధిస్తాయి. ఇది సాక్షాత్తు అమ్మవారు తన భక్తులను అనుగ్రహించి ఇచ్చిన వరం.

ఓం శ్రీ దుర్గా దేవ్యై నమః

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details