Tila Chaturthi 2025 :తెలుగు పంచాంగం ప్రకారం పరమ పవిత్రమైన మాసాలలో మాఘ మాసం ఒకటి. ఈ మాసంలో తెల్లవారుజామున చేసే నదీ స్నానాల వలన, సూర్యారాధన వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయనేది మహర్షుల మాట. మాఘ మాసం మొత్తం విశేషమైనదే అయినప్పటికీ కొన్ని తిథులకు విశేషించి ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ఓ విశిష్టమైన తిథి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
తిల చతుర్థి అంటే!
వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం మాఘ మాసంలో వచ్చే శుద్ధ చవితిని 'వర చతుర్థి' అని, 'తిల చతుర్థి' అని, 'కుంద చతుర్థి' అని అంటారు. ఈ రోజున గణపతిని పూజించడం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ రోజు గణపతిని యథాశక్తి పూజిస్తే ఆ స్వామి అనుగ్రహంతో తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. ఇక ఈ రోజున నువ్వులు దానం చేయడం వలన గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయట. అందువలన దీనిని 'తిల చతుర్థి' అని కూడా అంటారు. ఇక ఈ 'కుంద చతుర్థి' రోజున శివుడిని మల్లె పువ్వులతో పూజించడం వలన కూడా విశేషమైన ఫలాలు లభిస్తాయని విశ్వాసం.
తిల చతుర్థి ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం, మాఘ శుద్ధ చవితి ఫిబ్రవరి 1వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:30 నిమిషాల నుంచి మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12:27 నిమిషాల వరకు ఉంది. ప్రదోషకాలంలో చవితి ఉన్న రోజునే తిల చతుర్థిగా జరుపుకోవాలి కాబట్టి ఫిబ్రవరి 1వ తేదీ శనివారం రోజునే తిల చతుర్థిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈసారి తిల చతుర్థి శనివారం రావడం మరింత విశేషమని పండితులు చెబుతున్నారు. ఈ రోజు తిల చతుర్థి పూజ శాస్త్రోక్తంగా చేసుకుంటే ఏలినాటి శని బాధలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.
తిల చతుర్థి పూజా విధానం
తిల చతుర్థి పూజా విధానం గురించి స్కంద పురాణంలో వివరంగా ఉంది. ఈ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి శుచియై నిత్య పూజాదికాలు ముగించుకొని గణపతి సమక్షంలో దీక్ష తీసుకోవాలి. పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం గణపతిని పూజించాలి. ఇంట్లో కానీ, ఆలయంలో కానీ గణేశుని పంచామృతాలతో అభిషేకించి, జిల్లేడు పూలు, గరిక సమర్పించాలి. అష్టోత్తర శతనామాలతో వినాయకుని పూజించాలి. వినాయకునికి నువ్వులు, బెల్లంతో తయారు చేసిన లడ్డులు, ఉండ్రాళ్ళు, కొబ్బరికాయ, అరటిపండ్లు, మోదకాలు నైవేద్యంగా సమర్పించాలి. 'ఓం గం గం గణపతయే నమః' అనే గణేశ మూల మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. పూజ పూర్తి అయ్యాక ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి, దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కరించుకోవాలి. అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు.