తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

'సింహ' సంక్రమణం ఎప్పుడు? ఆ రోజేం చేయాలి? నదీ స్నానమాచరిస్తే అంత మంచిదా! - Sun Transit In Leo 2024 - SUN TRANSIT IN LEO 2024

Sun Transit In Leo 2024 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు మొత్తం 12 రాశులు ఉన్నాయి. ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశి పేరుతో సంక్రమణం ఏర్పడుతుంది. దానినే సంక్రాంతి అంటారు. త్వరలో సింహ సంక్రమణం ఏర్పడనున్న సందర్భంగా సింహ సంక్రమణ గురించిన విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

Sun Transit In Leo 2024
Sun Transit In Leo 2024 (ETV Bharat, Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Aug 15, 2024, 3:46 AM IST

Sun Transit In Leo 2024 : సూర్యుని రాశి మార్పు సందర్భంగా జరిగే సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. వేద జ్యోతిషశాస్త్రాన్ని అనుసరించే హిందువులు ఈ సంక్రమణాన్ని ప్రకృతిని ఆరాధించే పండుగలా జరుపుకుంటారు. సూర్యుడు ఏ ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశి పేరుతో సంక్రమణం ఉంటుంది. ఆగస్టు 16వ తేదీ రాత్రి 7 గంటల 45 నిమిషాలకు సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తుండం వల్ల సింహ సంక్రమణం ఏర్పడనుంది.

సంక్రమణ పుణ్యకాలం సందర్భంగా పాటించవలసిన ఆచారాలు
నదీస్నానం
సూర్యుడు సింహ రాశిలో ప్రవేశించే సందర్భంలో ఏర్పడే సింహ సంక్రమణ సమయంలో పవిత్ర నదులలో లేదా పవిత్ర జలాల్లో స్నానం చేయడం ఎంతో పుణ్యం. నదీస్నానం శరీరాన్ని, మనస్సును శుద్ధి చేసి ఆధ్యాత్మిక కార్యకలాపాలకు మనల్ని సిద్ధం చేస్తుందని ఋషులు, మునులు చెబుతారు.

సింహ సంక్రాంతి ప్రాముఖ్యం - దైవారాధన
సంక్రమణ సమయంలో చేసే దైవారాధనకు విశిష్టమైన ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా సింహ సంక్రమణ సమయంలో సూర్య భగవానుని, విష్ణువును ప్రధానంగా పూజిస్తారు. అలాగే ఈ రోజు దుర్గాదేవి ఆరాధన చేస్తే కార్యజయం, శత్రుజయం ఉంటాయని పెద్దలు చెబుతారు. సంక్రమణ సమయంలో తులసి దళాలతో విష్ణువును పూజించడం, గంగాజలంతో శివుని అభిషేకించడం కూడా ఎంతో మంచిది. సంక్రమణ సమయంలో చేసే చిన్నపాటి పూజకు కూడా విశేషమైన ఫలితం ఉంటుందని భవిష్య పురాణంలో వివరించారు.

దానధర్మాలు
హిందూ ధర్మశాస్త్రం దానధర్మాలకు పెద్ద పీట వేసింది. ముఖ్యంగా సింహ సంక్రమణ పుణ్యకాలం సమయంలో అవసరమైన వారికి దానం చేయడం, ఇతరులకు సహాయం చేయడం పుణ్య కార్యాలుగా పరిగణించబడతాయి. సంక్రమణ కాలంలో అన్నదానం, వస్త్రదానం, గోదానం, జలదానం, సాలగ్రామ దానం విశేషమని ఫలితాలనిస్తాయి.

సింహ సంక్రాంతి ఎక్కడ జరుపుకుంటారు?
సింహ సంక్రాంతి ప్రధానంగా దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో జరుపుకుంటారు, ఉత్తరాఖండ్‌లోని కుమౌన్ ప్రాంతంలో ప్రజలు కూడా ఈ రోజును ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా నదీస్నానాలు, దైవారాధనలు, దానధర్మాలు విశేషంగా చేస్తారు. అలాగే ఉత్తరభారతంలో సింహ సంక్రాంతి రోజు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం శుభకరంగా భావిస్తారు. రానున్న సింహ సంక్రమణం రోజు మనం కూడా నదీస్నానం, దైవారాధన, దానధర్మాలు చేద్దాం మన జీవితంలోకి నూతన కాంతులను ఆహ్వానిద్దాం. శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details