Vinayaka Idol Immersion 2024 :వర్షఋతువులో వచ్చే భాద్రపదమాసంలో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. ఇదే మాసంలో విఘ్నాధిపతి అయిన వినాయకుడిని కొలుచుకుంటాము. అదే వినాయక చవితి!
వినాయక చవితి సంప్రదాయం యావత్తూ, ప్రకృతికి అనుగుణంగా సాగుతుంది. నదులలో, వాగులలో దొరికే ఒండ్రుమట్టితో ఆ స్వామి ప్రతిమను రూపొందిస్తాము. ఏకవింశతి పత్రి పూజ పేరుతో 21 రకాల ఆకులతో గణనాధుని పూజిస్తాం. ఇలా కొలుచుకున్న స్వామిని, ఆయనను పూజించిన పత్రితో సహా నిమజ్జనం చేస్తాము. సృష్టి, స్థితి, లయ అనే మూడు దశలు వినాయక చవితి పూజలో కనిపిస్తాయి.
నిమజ్జనంలో ఔషధీ తత్వం
వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం, పత్రాలు ఉపయోగించడం వెనక మరో కారణం కూడా కనిపిస్తుంది. ఒండ్రు మట్టిలోనూ, పత్రాలలోనూ ఔషధ గుణాలు ఉంటాయి. గణపతికి చేసే షోడశోపచార పూజలో భాగంగా మాటిమాటికీ ఈ విగ్రహాన్నీ, పత్రాలనూ తాకడం వల్ల వాటిలోని ఔషధి తత్వం మనకి చేరుతుంది. పూజ ముగిసిన తర్వాత ఓ తొమ్మిది రోజుల పాటు ఆ విగ్రహాన్నీ, పత్రాలనూ ఇంట్లో ఉంచడం వల్ల చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధి గుణాలు చేరతాయి.
ఇలా తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్నీ, పత్రాలనీ ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తాము. ఈ క్రతువులో ఎక్కడా ఎలాంటి శేషము మిగలదు. అంతేకాదు! వినాయక చవితి నాటికి వర్షాలు ఊపందుకుంటాయి. వాగులూ, నదులూ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి.
అలాంటి సమయంలో తీరం వెంబడి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల వరద పోటు తగ్గే అవకాశం ఉంటుంది. పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటారు. నిమజ్జనంలో విడిచే పత్రితో నీరు కూడా క్రిమిరహితంగా మారిపోతుందన్నది పెద్దల మాట. అందుకేనేమో! నిమజ్జనం చేసే ఆచారం ఉన్న దసరా, బతుకమ్మ పండుగలు కూడా వర్ష రుతువులోనే వస్తాయి.
సామాజిక అంశాలు
ఇదండీ నిమజ్జనం వెనుక ఉన్న విశేషం. అంతే కాదు ప్రకృతి పరమైన అంశాలతో బాటు ఇందులో సామాజికాంశాలూ కూడా ఉన్నాయి. ఎవరికివారే యమునాతీరే అన్న రీతిగా మారిన ఈ ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో వాడవాడలా వినాయక చవితి విగ్రహాలు వెలసిన తర్వాత, ఇరుగూపొరుగూ కలిసి కోలాహలంగా ఈ వేడుకని జరుపుకోవడం, అలాగే సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో పిల్లలు, పెద్దలు కలిసి ఆనందంగా గడపడం మనం చూస్తున్నాం. ఇందువలన ఇరుగుపొరుగు వారి మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న సృజనాత్మకత, కళా విశేషాలు కూడా వెలికి వస్తాయి.