Simhachalam Appanna Chandanotsavam :సింహాచలంలో వెలసిన వరాహ లక్ష్మి నరసింహ స్వామి స్వయంభువు. ఏడాదిలో కేవలం 12 గంటలు మాత్రమే భక్తులు స్వామిని నిజరూపంలో దర్శనం చేసుకోవచ్చు. వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజున జరిగే పరమ పవిత్రమైన ఉత్సవం చందనోత్సవం. ఈ ఉత్సవంలో భాగంగా స్వామి విగ్రహంపై ఉన్న చందనాన్ని తొలగించి 12 గంటల పాటు భక్తులకు స్వామి నిజరూప దర్శనాన్ని కల్పిస్తారు. అనంతరం స్వామికి తొలి విడత సమర్పణ ఉంటుంది. ఈ రోజు స్వామిని నిజరూపంలో దర్శించుకున్న వారు సమస్త ఐహిక సుఖాలు పొంది, మోక్షాన్ని పొందుతారని శాస్త్ర వచనం.
- సింహాద్రి అప్పన్నకు వైశాఖ శుద్ధ పౌర్ణమికి రెండో విడత చందన సమర్పణ ఉంటుంది.
- నరసింహ స్వామికి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమికి మూడో విడత చందన సమర్పణ ఉంటుంది.
- సింహాద్రి అప్పన్నకు ఆషాడ పౌర్ణమికి నాలుగో విడత చందనం సమర్పణ ఉంటుంది.
కరాళ చందనం
నాలుగు విడతల చందన సమర్పణ పూర్తయిన తర్వాత శ్రావణ పూర్ణిమ నాడు స్వామి వారికి చందనమలదడం అనే కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని కరాళ చందన సమర్పణ ఉత్సవాన్ని అంటారు.
జన్మరాహిత్యాన్ని కలిగించే పవిత్రోత్సవం
భాద్రపద శుద్ధ దశమి నుంచి చతుర్దశి వరకు స్వామి వారి నిత్యనైమిత్తికాలలో తెలిసి గానీ, తెలియక గానీ జరిగిన దోష నివారణ కోసం జరిపే ఉత్సవం పవిత్రోత్సవం. ఈ ఉత్సవం కనులార చూసినా వారికి పునర్జన్మ ఉండదని పెద్దలు అంటారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.