Shravana Mangala Gowri Vratham 2024 : తెలుగు పంచాంగం ప్రకారం ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు మంగళ గౌరీ వ్రతం విధిగా ఆచరించాలి. ఈ లెక్కన చూస్తే ఆగస్టు 6న తొలి మంగళవారం అవుతుంది. అసలు మంగళ గౌరీ వ్రతం అంటే ఏమిటి? ఈ వ్రతం ఎలా ఆచరించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నూతన వధువులు నోచుకునే నోములు
శ్రావణ మంగళ గౌరీ వ్రతం ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు సుమంగళితనం కోసం చేస్తారు. ఆ సర్వమంగళ దేవి అయిన పార్వతీ దేవిని ప్రార్థిస్తూ చేసే నోము. ఈ వ్రతం చేయడం వలన కలకాలం సువాసినులుగా ఉంటారని ప్రతీతి. సాక్షాత్తు శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఈ వ్రతం గురించి చెప్పినట్లుగా మనకు నారద పురాణం ద్వారా తెలుస్తోంది.
పూజకు శుభ సమయం
శ్రావణ మంగళ గౌరీ పూజను చేసుకునే వారు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచియై పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఉదయం 7 గంటల కల్లా పూజను ప్రారంభించి 9 గంటల లోపే పూర్తి చేయాలి.
వ్రత విధానం
గణపతి పూజ
ఈ వ్రతం చేయడానికి ముందుగా పసుపుతో గణపతి చేయాలి. సమంత్రక పూర్వకంగా గణపతిని ఆవాహన చేసి షోడశోపచారాలు చేసి 'గుడం' అనగా బెల్లం నైవేద్యంగా సమర్పించి పూజను ప్రారంభించాలి.
తోరము ఇలా సిద్ధం చేసుకోవాలి
తెల్లటి దారమును ఐదు పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు పూలు, ఐదు చోట్ల కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు పోగుల దారమును ఉపయోగించి, ఐదు పువ్వులతో ఐదు ముడులతో తోరములను తయారు చేసుకుని, పీఠం వద్ద ఉంచి, పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరములను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరములను తయారు చేసుకున్న అనంతరం మంగళ గౌరీ పూజ మొదలు పెట్టాలి.
సంకల్పం
ఇలా తోరాన్ని తయారు చేసుకున్న తర్వాత పార్వతి దేవి విగ్రహాం లేదా చిత్రపటాన్ని పసుపు కుంకుమలతో అలంకరించిన పీటపై ఉంచాలి. అమ్మవారికి గంధం, కుంకుమ పెట్టి పువ్వులతో అలంకరించాలి. తర్వాత ఆచమనం చేసి, సంకల్పం చెప్పుకొని పూజను ప్రారంభించాలి.