Shani Pradosha Pooja Telugu : దేవదానవులు క్షీరసాగర మధనం చేసినప్పుడు వచ్చిన విషాన్ని పరమశివుడు తన కంఠంలో ఉంచుకొని సమస్త లోకాలను రక్షించిన రోజును శనిప్రదోషంగా పిలుస్తారు. ప్రతి నెలలో మనకు త్రయోదశి తిథి రెండు సార్లు వస్తుంది. ఒకటి శుక్ల పక్షంలో, రెండోది కృష్ణ పక్షంలో. అయితే శనివారం త్రయోదశి తిథి మధ్యాహ్నం సమయంలో ఉంటే దాన్ని శని ప్రదోషం అంటారు. అదే శనివారం సూర్యోదయంతో త్రయోదశి తిథి ఉంటే ఆ రోజును శనిత్రయోదశి అంటారు.
శని ప్రదోష పూజ ఎవరు చేయాలి?
జాతకంలో ఏమైనా దోషాలు అనగా వివాహ, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు వంటివి ఉన్నవారు శని ప్రదోషం రోజున శివారాధన చేయడం ద్వారా ఆ దోషాలను తొలగించుకోవచ్చు.
సకల పాపహరణం- శివారాధన సకల దేవతారాధన!
శని ప్రదోష పూజ చేసిన వారికి గత జన్మలో చేసిన పాపాలు పోవడమే కాకుండా సకల సంపదలు చేకూరుతాయి. శనివారం వచ్చే ప్రదోషం రోజంతా ఉపవాసం చేసి, సాయంత్రం వేళ శివార్చన చేయడం ద్వారా సమస్త జాతక దోషాలు పోయి అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతారు. అంతేకాదు ప్రదోష కాల పూజ చేస్తే ఒక్క శివుడిని మాత్రమే కాదు సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం.