తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

సంక్రాంతి రోజు ఈ దానాలు చేస్తే - సంవత్సరం మొత్తం ధనలాభమట! - SANKRANTI DANALU FOR FINANCIAL GAIN

-మకర సంక్రాంతి రోజు మూడు దానాలు చేస్తే మంచిదట -వివరిస్తున్న జ్యోతిష్య నిపుణులు మాచిరాజు

Sankranti 2025 Danalu in Telugu
Sankranti 2025 Danalu in Telugu (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2025, 12:57 PM IST

Sankranti 2025 Danalu in Telugu:తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు ఇలా ఒక్కటేమిటి మూడు రోజుల పాటు పల్లెటూళ్లన్నీ కళకళలాడనున్నాయి. ఇదిలా ఉంటే సంక్రాంతి రోజు కొన్ని దానాలు చేస్తే సంవత్సరం మొత్తం ధనలాభం కలుగుతుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

సంక్రాంతి అంటేనే దానానికి ప్రాధాన్యత ఉన్నటువంటి పండగని మాచిరాజు కిరణ్​కుమార్​ చెబుతున్నారు. కాబట్టి మకర సంక్రాంతి రోజు తప్పకుండా కొన్ని దానాలు చేయాలని, అందులో మూడు ప్రధానమైనవని చెబుతున్నారు. ఈ మూడింటిలో ఏది దానం చేసినా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయని వివరిస్తున్నారు.

పెరుగు దానం:మకర సంక్రాంతి రోజు మీ చేతులతో పెరుగు దానం ఇస్తే మంచి జరుగుతుందంటున్నారు మాచిరాజు. మరీ ముఖ్యంగా ఆవు పెరుగు ఇస్తే మంచిదని, అది లేని పక్షంలో గేదె పెరుగు ఇవ్వాలని సూచిస్తున్నారు. పెరుగు ఎందుకు దానం ఇవ్వాలంటే, పురాణాల ప్రకారం ద్రోణా చార్యుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో అతని భార్య కృపి, ఓ మహిర్షి సలహా మేరకు సంక్రాంతి రోజు పెరుగు దానం చేసిందని, అప్పటి నుంచి వాళ్లకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయని మహాభారతంలో పేర్కొన్నట్లు చెబుతున్నారు. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, ధనపరంగా కలిసి రావాలన్నా పండగ నాడు పెరుగు దానం ఇవ్వాలని చెబుతున్నారు. పెరుగు బదులు మజ్జిగ దానం ఇచ్చినా మంచిదంటున్నారు.

కూష్మాండ దానం: మకర సంక్రాంతి రోజు గుమ్మడికాయ దానం చేస్తే మంచిదంటున్నారు. బూడిద గుమ్మడికాయ బదులు మామూలు గుమ్మడికాయను దేవాలయంలోని బ్రాహ్మణుడికి దానం ఇస్తే మంచిదంటున్నారు. బ్రాహ్మాణులు అందుబాటులో లేకపోతే ఎవరికైనా మీ చేతితో దానం ఇస్తే శుభఫలితాలు లభిస్తాయంటున్నారు. ఇది ఎందుకు దానం ఇవ్వాలంటే, వరాహా పురాణం ప్రకారం మకర సంక్రాంతి రోజు శ్రీమహా విష్ణువు వరాహా రూపంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి భూమిని ఉద్ధరించాడని, కాబట్టి భూమి మొత్తాన్ని విష్ణుమూర్తికి దానం చేసిన ఫలితం కలగాలంటే గుమ్మడికాయ దానం ఇవ్వాలని చెబుతున్నారు.

గోదానం: మకర సంక్రాంతి పండగ నాడు గోవులను దానం ఇస్తే మంచిదంటున్నారు. గోవులన్నింటిలో తిల గోవును దానం ఇవ్వాలంటున్నారు. తిల గోవు అంటే ఓ ప్లేట్​లో నువ్వులను గోవు ఆకారంలో ఏర్పాటు చేయడం. ఈ తిల గోవును పండగనాడు దేవాలయంలో దానం ఇవ్వాలంటున్నారు. దీనిని దానం చేయడం వల్ల సంవత్సరం మొత్తం మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతున్నారు. వీటితో పాటు సంక్రాంతి నాడు దుప్పట్లు, పాదరక్షలు, గొడుగు, ఆహార పదార్థాలు, ధాన్యం వంటివి దానం ఇవ్వొచ్చని చెబుతున్నారు.

NOTE :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఈశాన్యంలో ఈ మూడు వస్తువులు ఉంచితే - అపార ధనలాభం కలుగుతుందట!

మీ ఇంట్లో కనక వర్షం కురవాలా? - వేంకటేశ్వర స్వామిని ఈ రోజున దర్శించుకుంటే చాలు!

ABOUT THE AUTHOR

...view details